జాతీయ వార్తలు

మ‌హారాష్ట్ర‌లో రిగ్గింగ్‌.. బీహార్‌లోనూ అదే జ‌రుగుతుంది : రాహుల్ గాంధీ

గ‌త ఏడాది న‌వంబ‌ర్‌లో జ‌రిగిన మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రిగ్గింగ్ జ‌రిగిన‌ట్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అదే త‌ర‌హాలో ఈ ఏడాది బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ రిగ్గింగ్ జ‌ర‌గ‌నున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. త‌న ఎక్స్ అకౌంట్‌లో రాహుల్ ఇవాళ ఓ పోస్టు పెట్టారు. మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల రిగ్గింగ్‌పై రాహుల్ రాసిన క‌థ‌నాన్ని ఓ ప‌త్రికలో పోస్టు చేశారు. ఆ ప‌త్రిక రిపోర్టును ఆయ‌న త‌న ఎక్స్‌లో పోస్టు చేశారు. రిగ్గింగ్ ప్ర‌జాస్వామ్యానికి 2024 మ‌హారాష్ట్ర ఎన్నిక‌లు బ్లూప్రింట్ అని, ఆ రిగ్గింగ్ ఎలా జ‌రిగిందో ఈ ఆర్టిక‌ల్‌లో తెలుస్తుంద‌ని రాహుల్ వెల్ల‌డించారు. అయిదు ద‌శ‌ల్లో రిగ్గింగ్ జ‌రుగుతుంద‌ని త‌న క‌థ‌నంలో రాహుల్ తెలిపారు. తొలి ద‌శ‌లో ఎన్నిక‌ల సంఘంలో రిగ్గింగ్ ప్ర‌క్రియ ప్రారంభం అవుతుంద‌న్నారు. ఎల‌క్టోర‌ల్ రోల్‌కు న‌కిలీ ఓట‌ర్ల‌ను జోడిస్తార‌న్నారు. ఆ త‌ర్వాత బోగ‌స్ ఓట్ల ఆధారంగా బీజేపీ గెలుస్తుంద‌న్నారు. ఆధారాల‌ను దాచిపెడుతార‌ని చెప్పారు. రిగ్గింగ్‌ను మ్యాచ్ ఫిక్సింగ్‌తో పోల్చారు. చీటింగ్ చేసిన పార్టీ గెలుస్తుంద‌ని, కానీ దాని వ‌ల్ల వ్య‌వ‌స్థ‌ల‌న్నీ న‌ష్ట‌పోతాయ‌న్నారు. ప్ర‌జ‌ల్లో విశ్వాసం నాశ‌నం అవుతుంద‌న్నారు. మ‌హారాష్ట్ర‌లో జ‌రిగిన మ్యాచ్ ఫిక్సింగ్ .. త్వ‌ర‌లో బీహార్ ఎన్నిక‌ల్లో జ‌రుగ బోతోంద‌న్నారు. మ్యాచ్ ఫిక్స్ ఎన్నిక‌లు ఏ ప్ర‌జాస్వామ్య దేశానికైనా విషం లాంటింద‌న్నారు. 288 స్థానాలు ఉన్న మ‌హారాష్ట్ర అసెంబ్లీలో.. బీజేపీ 132, శివ‌సేన షిండే 57, ఎసీపీ 41, కాంగ్రెస్ 16, శివ‌సేన ఉద్ద‌వ్ 20, ఎన్సీపీ శ‌ర‌ద్ ప‌వార్ ఫ్యాక్ష‌న్‌కు 10 సీట్లు ద‌క్కాయి. అత్య‌ధిక సీట్లు బీజేపీకి ద‌క్కాయి. రాహుల్ గాంధీ వ్యాఖ్య‌లు ఎన్నిక‌ల సంఘాన్ని అవ‌మానిస్తున్న‌ట్లుగా ఉన్నాయ‌ని బీజేపీ ఆరోపించింది.

రాహుల్ గాంధీ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై ఎన్నికల సంఘం స్పందన

Rahul Gandhi Match Fixing Allegations Election Commission Response
  • మహారాష్ట్ర ఎన్నికల్లో ‘మ్యాచ్ ఫిక్సింగ్’ జరిగిందని రాహుల్ గాంధీ కొత్త ఆరోపణలు
  • రాహుల్ వ్యాఖ్యలు పూర్తిగా అసంబద్ధమన్న ఎన్నికల సంఘం
  • గత ఏప్రిల్‌ నాటి పత్రాన్ని మళ్ళీ విడుదల చేసిన ఈసీ
  • పోలింగ్ సమయంలో ఏజెంట్ల నుండి తీవ్ర ఫిర్యాదుల్లేవన్న ఎన్నికల సంఘం
  • ఓటర్ల జాబితాపై కూడా పెద్దగా అభ్యంతరాలు రాలేదని స్పష్టీకరణ
  • సీసీటీవీ ఫుటేజ్ విడుదల చేయాలని డిమాండ్ చేసిన రాహుల్ గాంధీ

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ‘మ్యాచ్ ఫిక్సింగ్’ జరిగిందంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన సంచలన ఆరోపణలను భారత ఎన్నికల సంఘం (ఈసీ) తీవ్రంగా ఖండించింది. ఈ ఆరోపణలు పూర్తిగా అసంబద్ధమైనవని, నిరాధారమైనవని పేర్కొంటూ గట్టిగా బదులిచ్చింది. ఈ మేరకు గత ఏప్రిల్‌లో ఇచ్చిన వివరణాత్మక పత్రాన్ని మరోసారి విడుదల చేసింది.

ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో రాసిన వ్యాసంలో రాహుల్ గాంధీ, 2024 నవంబరులో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం నియామక ప్యానెల్‌ను తారుమారు చేయడం, ఓటర్ల జాబితాలో నకిలీ ఓటర్లను చేర్చడం, ఓటింగ్ శాతాన్ని కృత్రిమంగా పెంచి చూపడం, లక్షిత దొంగ ఓటింగ్ వంటి పలు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ కూటమి ఘోర పరాజయం పాలైందని ఆయన ఆరోపించారు. ఎన్నికల సంఘం సంతకం లేని, దాటవేసే ధోరణిలో నోట్స్ విడుదల చేసిందని, తాను లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా, బూత్‌ల సీసీటీవీ ఫుటేజ్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

అయితే, ఎన్నికల సంఘం రాహుల్ ఆరోపణలను తోసిపుచ్చింది. పోలింగ్ సమయంలో గానీ, ఆ తర్వాత జరిగిన పరిశీలనలో గానీ కాంగ్రెస్ సహా ఏ రాజకీయ పార్టీ ఏజెంట్ల నుంచి కూడా తీవ్రమైన ఫిర్యాదులు రాలేదని ఈసీ స్పష్టం చేసింది. ఓటర్ల జాబితా సవరణలపైనా పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం కాలేదని, 9.77 కోట్ల ఓటర్లకు గాను కేవలం నామమాత్రపు అప్పీళ్లే దాఖలయ్యాయని గుర్తు చేసింది. కాంగ్రెస్ పార్టీయే రాష్ట్రవ్యాప్తంగా 27,000 మందికి పైగా బూత్ లెవల్ ఏజెంట్లను నియమించిందని, వారెవరూ ఈ తరహా ఫిర్యాదులు చేయలేదని పేర్కొంది.

ఇప్పటికే ఈ అంశాలపై కాంగ్రెస్ పార్టీకి గతేడాది డిసెంబర్ 24న సమగ్ర సమాధానం ఇచ్చామని, ఆ వివరాలు ఈసీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపింది. వాస్తవాలను విస్మరించి, పదేపదే నిరాధార ఆరోపణలు చేయడం చట్టబద్ధ పాలనను అపహాస్యం చేయడమేనని ఈసీ వ్యాఖ్యానించింది. భారత ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, ప్రపంచస్థాయి ప్రమాణాలతో జరుగుతుందని, ఓటర్ల తీర్పు వ్యతిరేకంగా వచ్చినప్పుడు ఎన్నికల సంఘాన్ని నిందించడం తగదని హితవు పలికింది.

Related posts

అయోధ్య రామమందిరాన్ని దర్శించనున్న నూతన మిస్ వరల్డ్ సుచాత చువాంగ్ శ్రీ

Ram Narayana

అమల్లోకి కొత్త కార్మిక చట్టాలు.. ఉద్యోగులు తెలుసుకోవాల్సిన కీలక మార్పులివే!

Ram Narayana

తమిళనాడులో గూడ్స్ రైలును ఢీకొట్టిన దర్భంగా ఎక్స్‌ప్రెస్!

Ram Narayana