రాజకీయ లబ్ధి కోసమే కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్లు కుంగితే మొత్తం కాళేశ్వర ప్రాజెక్టు కూలినట్లు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లిచ్చి కన్నీళ్లు తుడిచిన కేసీఆర్‌పై అభాండాలు వేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి తెలంగాణ గొంతు పిసికే ప్రయత్నం చేస్తున్నాయని చెప్పారు. కాళేశ్వరంపై ప్రజలకు వాస్తవాలు తెలియాలని, తాము చెప్పే విషయాలు నూటికి నూరుపాళ్లు నిజమన్నారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారాలు-వాస్తవాలు’ అనే పేరుతో తెలంగాణ భవన్‌లో హరీశ్‌రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్‌స్టేషన్లు, 21 పంప్‌హౌస్‌లు, 203 కి.మీ సొరంగాలు, 1,531 కి.మీ గ్రావిటీ కాలువలు, 98 కి.మీ ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజీ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు నీటి ఎత్తిపోతలు. తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీరు ఎత్తిపోసేలా మొదట రూపకల్పన చేశారు. తమ్మిడిహట్టి వద్ద నీళ్లు తక్కువ ఉంటాయని ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చాం. మేడిగడ్డ బ్యారేజీని 7 బ్లాకులుగా 85 పియర్లుగా నిర్మించారు. కాళేశ్వరం లేకుండా పంటలు పండాయని కాంగ్రెస్ చెబుతోంది. ఈ ప్రాజెక్టు వల్లనే యాసంగిలోనూ పంటలు పండాయి. ఈ ప్రాజెక్టుకు 3 వనరుల ద్వారా నీటి లభ్యత ఉంది. ఆ నీటితో వేలాది చెరువులు నింపొచ్చు. మేడిగడ్డ నుంచి మల్లన్న సాగర్ వరకు నిర్మించినవన్నీ వాడకంలోనే ఉన్నాయి. కాళేశ్వరం కింద కాలువ ద్వారానే 90 వేల ఎకరాలకు నీరు అందించొచ్చు.