- పంజాబ్ లో ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ ధిల్లాన్ పై రేప్ కేసు
- జిరాక్ పూర్ మహిళ ఆరోపణలతో ఎమ్మెల్యేపై కేసు నమోదు
- రాజకీయ కుట్రతోనే కేసు పెట్టారంటున్న ఎమ్మెల్యే హర్మీత్
అత్యాచారం కేసులో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తుండగా పంజాబ్ ఆప్ ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ ధిల్లాన్ పోలీసులపై కాల్పులు జరిపాడు. ఆపై కస్టడీ నుంచి తప్పించుకుని పారిపోయాడు. మంగళవారం ఉదయం కర్నాల్ లో హర్మీత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసులపై హర్మీత్, ఆయన మద్దతుదారులు కాల్పులు జరిపారు. అనంతరం అనుచరులతో కలిసి హర్మీత్ అక్కడి నుంచి పారిపోయారు. ప్రస్తుతం హర్మీత్, ఆయన అనుచరుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. పటియాలాలోని సనూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ ధిల్లాన్ పై జిరాక్ పూర్ కు చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యే తనను మోసం చేశాడని, విడాకులయ్యాయని చెప్పి తనకు దగ్గరయ్యాడని ఆరోపించింది. పెళ్లి చేసుకోవాలని కోరితే బెదిరింపులకు దిగాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఫిర్యాదుతో పోలీసులు ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కర్నాల్ లో హర్మీత్ సింగ్ ను అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలిస్తుండగా.. హర్మీత్, ఆయన సహాయకులు అధికారులపై కాల్పులు జరిపారు.
హర్మీత్ సింగ్ ఏమంటున్నారంటే..?
తనపై వచ్చిన ఆరోపణలను ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ ఖండించారు. రాజకీయ కుట్రతోనే తనపై కేసు నమోదైందని ఫేస్ బుక్ లైవ్ లో పేర్కొన్నారు. ఆప్ ప్రభుత్వంపైనా ఆయన విమర్శలు చేశారు. ఢిల్లీలోని ఆప్ అధిష్ఠానం పంజాబ్ లో పాలన సాగిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో వరదల్లో చిక్కుకున్న ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తున్నందుకే తనపై అక్రమంగా కేసు పెట్టారని హర్మీత్ సింగ్ ఆరోపించారు.
సీఎంను విమర్శించిన గంటల్లోనే.. పంజాబ్ ఆప్ ఎమ్మెల్యేపై రేప్ కేసు, అరెస్ట్

- పంజాబ్ ఆప్ ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ పఠాన్‌మజ్రా అరెస్ట్
- మాజీ భార్య ఫిర్యాదుతో రేప్ కేసు నమోదు
- హర్యానాలో అదుపులోకి తీసుకున్న పంజాబ్ పోలీసులు
- సీఎంను విమర్శించిన కొన్ని గంటల్లోనే ఈ పరిణామం
- ఢిల్లీ నేతల వీడియోలు తన దగ్గరున్నాయని ఎమ్మెల్యే ఆరోపణ
- ఇది ఢిల్లీ, పంజాబ్ మధ్య కబడ్డీ ఆట అని వ్యాఖ్య
పంజాబ్‌లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పార్టీ ఢిల్లీ నాయకత్వాన్ని, ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌ను బహిరంగంగా విమర్శించిన కొన్ని గంటల్లోనే సనౌర్ ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ పఠాన్‌మజ్రా అత్యాచారం ఆరోపణలపై అరెస్ట్ కావడం రాజకీయంగా కలకలం రేపుతోంది.
గత రాత్రి 10:17 గంటలకు పటియాలా సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌లో హర్మిత్ సింగ్ మాజీ భార్య ఫిర్యాదు చేశారు. 2014 ఫిబ్రవరి నుంచి 2024 జూన్ మధ్య కాలంలో ఎమ్మెల్యే తనపై అత్యాచారానికి పాల్పడ్డారని, మోసం చేశారని, బెదిరించారని ఆమె ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసు నమోదైన కొన్ని గంటల్లోనే, మంగళవారం ఉదయం హర్యానాలోని కర్నాల్‌లో ఉన్న బంధువుల గ్రామంలో హర్మీత్ సింగ్‌ను పంజాబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అరెస్ట్‌కు ముందు ఒక వీడియో విడుదల చేసిన హర్మిత్ సింగ్ తనపై రేప్ కేసు పెట్టారని, దీనిని తాను తేలిగ్గా తీసుకోనని హెచ్చరించారు. అనంతరం ఒక టీవీ చానెల్‌తో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఆప్ ఢిల్లీ నేతలకు సంబంధించిన అశ్లీల వీడియోలు నా దగ్గర ఉన్నాయి. అందుకే నాపై కక్ష సాధిస్తున్నారు. ఇది ఢిల్లీ, పంజాబ్ మధ్య మొదలైన కబడ్డీ ఆట” అని ఆయన ఆరోపించారు.
ఇటీవల రాష్ట్రంలో వరదల నియంత్రణ విషయంలో పార్టీ ఢిల్లీ నాయకత్వం, సీఎం భగవంత్ మాన్‌పై హర్మీత్ సింగ్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన అరెస్ట్ కావడం పంజాబ్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.