- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం
- కొండా సురేఖ మినహా మంత్రులు అందరూ హాజరు
- అంతకుముందు భట్టి విక్రమార్క, మీనాక్షి నటరాజన్‌తో సమావేశం
తెలంగాణ సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి మంత్రి కొండా సురేఖ గైర్హాజరయ్యారు. ఆమె హాజరు కాకపోవడానికి గల కారణాలు తెలియరాలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. బీసీ రిజర్వేషన్ల అంశం, ఎస్ఎల్‌బీసీ పనుల ప్రారంభం, కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ వంటి అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. పలు అభివృద్ధి ప్రాజెక్టుల గురించి కూడా చర్చించారు.
ఈ మంత్రివర్గ సమావేశానికి కొండా సురేఖ మినహా మిగతా మంత్రులందరూ హాజరయ్యారు. సమావేశానికి ముందు కొండా సురేఖ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కతో, ఆ తర్వాత పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌తో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో, కొండా సురేఖ మంత్రివర్గ సమావేశానికి హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
కొండా సురేఖ ఓఎస్డీగా ఉన్న సుమంత్‌ను ప్రభుత్వం ఇటీవల ఆ బాధ్యతల నుంచి తప్పించిన విషయం తెలిసిందే. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సిమెంట్ కంపెనీల యాజమాన్యాలను ఆయన బెదిరించినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో ఆయనపై చర్యలు తీసుకున్నారు. అంతకుముందు మేడారం జాతర అంశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో విభేదాలు వచ్చాయి. దీంతో ఇటీవల కొండా సురేఖ తరుచూ వార్తల్లో నిలిచారు.
నిన్న రాత్రి ఏం జరిగిందంటే!: పార్టీ పెద్దలకు వివరించిన కొండా సురేఖ
- మీనాక్షి నటరాజన్, మహేశ్ కుమార్ గౌడ్‌ను కలిసిన కొండా సురేఖ
- తన విషయంలో జరుగుతున్న పరిణామాలను వారికి తెలిపిన కొండా సురేఖ
- సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారన్న మంత్రి
తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌లను కలిసి నిన్న రాత్రి తన ఇంటి వద్దకు పోలీసులు వచ్చిన సమయంలో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలను వారికి వివరించారు. గత కొంతకాలంగా తన విషయంలో జరుగుతున్న అంశాలను ఆమె వారికి తెలియజేశారు.
భేటీ అనంతరం ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, తన సమస్యను పరిష్కరించడానికి పార్టీ పెద్దలు హామీ ఇచ్చారని తెలిపారు. వారు ఈ విషయాన్ని పరిష్కరిస్తామని చెప్పారని, కాబట్టి మిగిలిన విషయాలను వారే చూసుకుంటారనే నమ్మకంతో ఉన్నానని అన్నారు.
గత కొన్ని రోజులుగా తనను, తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారని కొండా సురేఖ మీనాక్షి నటరాజన్, మహేశ్ కుమార్ గౌడ్‌లకు వివరించినట్లు తెలుస్తోంది. తనను ఇబ్బంది పెడుతున్నారని ఆమె ఫిర్యాదు చేశారు. డెక్కన్ సిమెంట్ యాజమాన్యం వ్యవహారంలో జరిగిన పరిణామాలను, వారితో జరిగిన చర్చలు, ఆ సంస్థ అక్రమాలు తదితర విషయాలను ఆమె తెలియజేశారు.
సిమెంట్ కంపెనీల యాజమాన్యాలను బెదిరిస్తున్నారనే ఆరోపణలతో మంత్రి కొండా సురేఖ ఓఎస్డీగా ఉన్న సుమంత్‌ను ప్రభుత్వం ఆ బాధ్యతల నుంచి తప్పించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని కొండా సురేఖ ఇంటికి పోలీసులు వెళ్లారు. సురేఖ నివాసంలో సుమంత్ ఉన్నారన్న సమాచారంతో సాధారణ దుస్తుల్లో ఉన్న పోలీసులు అక్కడకి చేరుకున్నారు. మంత్రి కుమార్తె సుస్మిత వారిని ప్రశ్నించారు. ఈ క్రమంలో సుస్మిత మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పెద్దలపై విమర్శలు చేశారు.