చరిత్ర లేని వారు దేశభక్తులా-సిపిఐ శతాబ్ది ఉత్సవ సభలో డి. రాజా
-ప్రజల కోసం మరో వందేళ్లు పోరాటానికి సిద్ధం
-ట్రంప్ తీరును ఎర్ర జెండా అడ్డుకుంటుంది.
-అమెరికాను ప్రశ్నించే శక్తిని మోడీ కోల్పోయారు

చరిత్ర లేని వారు దేశభక్తులుగా చెప్పుకునేందుకు తాపత్రయ పడుతున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి డి. రాజా ఆరోపించారు. వందేళ్లుగా ప్రజల పక్షాన పోరాడుతున్నామని భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు అత్యంత కీలక ఘట్టమని ఈ దేశంలో సంపూర్ణ స్వాతంత్య్రానికి పిలుపునిచ్చిన ఏకైక పార్టీ సిపిఐ మాత్రమేనన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ శత వసంతాల ముగింపు సభ సందర్భంగా ఖమ్మం ఎస్ఆర్అండ్్బజిఎన్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన పార్టీ కార్యకర్తలతో బహిరంగ సభా స్థలి కిటకిటలాడింది. తెలంగాణ రాష్ట్ర సిపిఐ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాజా మాట్లాడుతూ వందేళ్లు త్యాగాలతోనే గడిచిపోయిందని అనేక మంది తమ త్యాగాలతో ఈ నేలను పునితం చేశారన్నారు. 1925 డిసెంబర్ 26న కాన్పూర్‌లో సిపిఐ ఆవిర్భావించిందని అంతకు ముందు 1985లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం జరిగిందన్నారు. ఈ దేశంలో కాంగ్రెస్, కమ్యూనిస్టులకు మాత్రమే ఒక రాజకీయ చరిత్ర ఉందని వందేళ్ల చరిత్ర అని చెప్పుకుంటున్న ఆర్ఎన్ఎస్కు అసలు చరిత్ర లేదన్నారు. దేశ స్వాతంత్య్రంలోనూ ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ పాత్ర ఏమిటని రాజా ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కంటే ముందే సిపిఐ సంపూర్ణ స్వాతంత్య్రానికి పిలుపునిచ్చిందని ఆయన తెలిపారు. దేశ చరిత్రలో అత్యంత కీలక ఘట్టమని రాజా అభివర్ణించారు. స్వాతంత్ర్య అనంతరం అనేక పరిణామాలలో కమ్యూనిస్టు పార్టీ అత్యంత కీలక భూమిక పోషించిందన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నియంతగా వ్యవహరించాలని ప్రయత్నిస్తున్నాడని మరో హిట్లర్ కావాలనుకుంటున్నాడని ట్రంప్‌ను ఎర్ర జెండాలు ఎదుర్కొంటాయని రాజా స్పష్టం చేశారు. సామ్రాజ్యవాద ధోరణితో ట్రంప్ వ్యవహరిస్తున్నాడని ఆయన ఆరోపించారు. మెక్సికో, కోలంబియా, క్యూబా వంటి దేశాలకు బెదిరింపులు చేయడం అనుచితమన్నారు. రష్యా, ఉక్రేన్ యుద్ధాన్ని సాకుగా చేసుకుని బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తున్న ట్రంప్‌ను ప్రశ్నించే శక్తి భారత ప్రధాని మోడీకి లేదన్నారు. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లు చేస్తుందని దీనిని నిలిపివేయాలంటూ అమెరికా ఒత్తిడి తీసుకు రావడం శోచనీయమన్నారు. పాలస్తీనా అంశాన్ని ప్రస్థావిస్తూ పాలస్తీనా స్వతంత్ర దేశంగా ఉండే హక్కు ఉందన్నారు. ఐక్యరాజ్యసమితి మద్దతు ఉన్న ద్విరాష్ట్ర పరిష్కారానికి సిపిఐ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. భారతదేశంలో మతోన్మాద శక్తులు విజృంభిస్తున్నాయని సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతమవుతుందని ఇది దేశ భవిష్యత్తుకు మరింత ప్రమాదకరమన్నారు. ఫాసిస్టు శక్తులను ఎదుర్కొనేందుకు అన్ని లౌకిక శక్తులు ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. బలమైన ఉద్యమ నిర్మాణాల ద్వారా మతోన్మాద శక్తులను అడ్డుకుంటామని రాజా ధీమా వ్యక్తం చేశారు. వందేళ్ల కమ్యూనిస్టు ఉద్యమాన్ని ప్రతిభింభిస్తూ జరిగిన భారీ బహిరంగ సభ నూతన ఉత్తేజాన్ని ఇస్తుందన్నారు.

బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ …సీఎం రేవంత్ రెడ్డి
మోడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ,కమ్యూనిస్టులు దండు కట్టాలి
పేదల హక్కులను కాలరాసేందుకే సర్ తెచ్చారు
అంబానీ ,ఆదానీలకు కూలీలు దొరకటం లేదని మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం తొలగించారు
మోడీ -అమిత్ షా కలిసి వచ్చిన ఖమ్మం జిల్లాలో రెండు సర్పంచ్ స్థానాలు గెలవలేరు
తులసి వనంలో బీజేపీ లాంటి గంజాయి మొక్కలకు తావు లేదు ..
బీజేపీ అంటేనే బ్రిటిష్ జనతా పార్టీ ,బ్రిటిష్ వాళ్ళలాగానే విభజించు పాలించు వారి సిద్ధాతం ..మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా నిక్కచ్చిగా పోరాడుతున్న కమ్యూనిస్టులను అభినందిస్తున్నానని తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి కమ్యూనిస్టుల పోరాటాలను ప్రశంశించారు ..సిపిఐ 100 సంవత్సరాల ఉత్సవాలను పురస్కరించుకొని ఖమ్మంలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ కేంద్రం లోని మోడీ నిరంకుశ,మతతత్వ విధానాలకు వ్యతిరేకంగా దండు కట్టాలని రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలనీ పిలుపు నిచ్చారు ..పేదల ఆదివాసీల దళితుల హక్కులను హరిస్తున్న మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని అందుకు కమ్యూనిస్టుల స్ఫూర్తి అవసరమని అభిప్రాయం పడ్డారు .కమ్యూనిస్టుల ,ఎర్రజెండాలు పోరాటాలవల్లనే దేశంలో పేదలకు ,కార్మికులకు అనేక చట్టాలు వచ్చాయని పనిగంటలు తగ్గాయని , సంక్షేమ పథకాలు పేదలకు అందుతున్నాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వారి వల్లనే వచ్చిందని రేవంత్ రెడ్డి చెప్పారు .ఆ పథకాన్ని ఎత్తి వేసేందుకు జరుగుతున్న కుట్రలను వివరించారు .అంబానీ ,ఆదానీలకు కూలీలు దొరకనందువల్లనే ఈ పథకాన్ని నీరుగార్చేందుకు మోడీ ప్రభుత్వం పూనుకున్నదని విమర్శించారు . రైతులకు గిట్టుబాటు ధరలు ,వేతన చట్ట కూడా కమ్యూనిస్టుల ఉద్యమ ఫలితమేనని అన్నారు .. భూమి ,భుక్తి ,విముక్తి కోసం జరిగిన నిజం నవాబును వ్యతిరేక పోరాటంలోనూ కమ్యూనిస్టుల త్యాగాలను సీఎం శ్లాఘించారు .కమ్యూనిస్టు నేతలు పుచ్చలపల్లి సుందరయ్య , చండ్ర రాజేశ్వరరావు , నల్లమల గిరిప్రసాద్ , పువ్వాడ నాగేశ్వరరావు పేర్లను ప్రస్తావించి వారిని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు . తమకు 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మార్చాలని చేశారని కానీ ప్రజలు అందుకు భిన్నంగా తీర్పు నిచ్చారని అన్నారు ..పేదలకు ఓట్లు లేకుండా చేయాలనీ దురుద్దేశంతో వారి ఓట్లు తొలగించేందుకు సర్ అనే దాన్ని తెచ్చి మీరు ఈ దేశస్తులు అవునా కదా …అంటూ ఆధారాలు చూపమని అంటున్నారని ఇది ఓట్లు తొలగింపు కుట్రలో భాగమేనని అన్నారు .ఖమ్మం జిల్లా అంటేనే కమ్యూనిస్టులకు కంచుకోట …మోడీ -అమిత్ షా వచ్చిన రెండు పంచాయతీలు గెలిపించలేరని ప్రజల హర్షద్వానాలమధ్య అన్నారు .తులసి వనంలో గంజాయి మొక్కలకు తావులేదని అన్నారు ..

ఈ సభలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వాకాటి శ్రీహరి, సిపిఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు అమర్జిత్ కౌర్, గిరిశర్మ, అనిరాజా, ప్రకాష్ బాబు, సందోష్ బాబు, పల్లా వెంకటరెడ్డి, బినయ్ విశ్వం, రామకృష్ణ పాండా, కె. రామకృష్ణ, కుల్దేవ్, జాతీయ కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ కె. నారాయణ, సిపిఐ సీనియర్ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు, మీడియా అకాడమీ ఛైర్మన్ కె. శ్రీనివాసరెడ్డి, సిపిఐ రాష్ట్ర సహయ కార్యదర్శులు తకెళ్లపల్లి శ్రీనివాసరావు, ఈటి నర్సింహ, సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు, ఎస్కో సాబీర్ పాషా, వనజా, నాగేశ్వరరావు, సత్యనారాయణ, ఎంఎల్‌సి ఎన్. సత్యం, ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు వందేమాతరం శ్రీనివాస్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.