- ఇరాన్‌తో యుద్ధం అమెరికాకు పెను భారంగా మారనుందని అంచనా
- యుద్ధం కొనసాగితే రూ.18 లక్షల కోట్లకు పైగా నష్టం తప్పదని హెచ్చరిక
- చర్చల ప్రతిపాదనను తిరస్కరించిన ట్రంప్.. వెనక్కి తగ్గేది లేదని స్పష్టీకరణ
- యుద్ధం వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగే ప్రమాదం
అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ఆ దేశ ఖజానాపై పెను భారాన్ని మోపనుంది. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే అమెరికాకు ఏకంగా 210 బిలియన్ డాలర్లు (సుమారు రూ.18.87 లక్షల కోట్లు) ఖర్చవుతుందని పెన్ వార్టన్ బడ్జెట్ మోడల్ నిపుణులు అంచనా వేస్తున్నారు. యుద్ధం మొదలైన తొలిరోజే అమెరికా దాదాపు 779 మిలియన్ డాలర్లు (రూ.6,900 కోట్లు) ఖర్చు చేసిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
యుద్ధం కోసం అమెరికా తన అత్యంత ఖరీదైన ఆయుధ సంపత్తిని వినియోగిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్దదైన ‘యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్’ వంటి రెండు భారీ విమానవాహక నౌకలను రంగంలోకి దించింది. వీటిలో ఒక్కో నౌక నిర్వహణకే రోజుకు రూ.58 కోట్లు ఖర్చవుతోంది. సైనిక మోహరింపుల కోసమే సుమారు రూ.5,500 కోట్లు వెచ్చించినట్లు నివేదికలు చెబుతున్నాయి. వీటికి తోడు ఇజ్రాయెల్‌కు అందిస్తున్న ఆర్థిక సాయాన్ని కూడా లెక్కిస్తే ఈ వ్యయం మరింత పెరగనుంది.
మరోవైపు, ఈ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. చర్చలకు రావాలన్న ఇరాన్ ప్రతిపాదనను ఆయన తోసిపుచ్చారు. “ఇరాన్ వైమానిక, నౌకాదళాలు ధ్వంసమయ్యాయి. ఇప్పుడు చర్చలకు వస్తామంటున్నారు. కానీ, సమయం మించిపోయింది” అని ట్రంప్ తన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. యుద్ధం ఎంతకాలం సాగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు.
ఈ పోరు నెలల తరబడి కొనసాగితే, అది కేవలం అమెరికా ఆర్థిక వ్యవస్థపైనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. మరోవైపు, తమ ఆత్మరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తామని ఇరాన్ కూడా స్పష్టం చేయడంతో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి.
ఇరాన్‌పై అమెరికా యుద్ధ గర్జన: 50 వేల సైన్యం, 200 యుద్ధ విమానాలు మోహరింపు…

- ఇరాన్‌పై అమెరికా భారీ సైనిక చర్య ప్రారంభం
- రంగంలోకి 50 వేల మంది సైనికులు, 200 యుద్ధ విమానాలు
- ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలే లక్ష్యంగా దాడులు
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో ఆరుగురు అమెరికా సైనికులు మృతి
- 2003 ఇరాక్ యుద్ధం తర్వాత ఇదే అతిపెద్ద సమీకరణ
మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మరింత దట్టంగా కమ్ముకున్నాయి. ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భారీ సైనిక చర్యకు దిగింది. ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ పేరుతో చేపట్టిన ఈ ఆపరేషన్‌లో భాగంగా 2003 ఇరాక్ యుద్ధం తర్వాత అత్యంత భారీ స్థాయిలో సైన్యాన్ని మోహరించింది. సుమారు 50,000 మంది సైనికులు, 200కు పైగా యుద్ధ విమానాలను రంగంలోకి దించింది.
ఈ సైనిక చర్యలో భాగంగా రెండు శక్తిమంతమైన విమానవాహక నౌకలతో పాటు, బీ-2 స్పిరిట్ వంటి అత్యాధునిక స్టెల్త్ బాంబర్లను కూడా అమెరికా ఉపయోగిస్తోంది. ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలు, క్షిపణి కేంద్రాలు, భూగర్భ అణు కేంద్రాలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. గత 100 గంటల్లోనే అమెరికా, ఇజ్రాయెల్ దళాలు కలిసి దాదాపు 2,000 లక్ష్యాలపై బాంబుల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. ఇది కేవలం హెచ్చరిక కాదని, ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని నిర్వీర్యం చేయడమే తమ లక్ష్యమని పెంటగాన్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇరాన్ అణు ముప్పు నుంచి ప్రపంచాన్ని కాపాడేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ చర్యను సమర్థించారు. మరోవైపు, ఇరాన్ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై డ్రోన్లతో ప్రతిదాడులకు దిగుతోంది. ఈ దాడుల్లో ఇప్పటికే ఆరుగురు అమెరికా సైనికులు మరణించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. అగ్రరాజ్యం ఇంత భారీ ఎత్తున సైన్యాన్ని మోహరించడంతో మధ్యప్రాచ్యంలో సంక్షోభం మరింత ముదిరినట్టయింది.