అంతర్జాతీయం

అమెరికా యుద్ధ విరమణ ప్రతిపాదనలకు ఎండ్ కార్డు పడుతుందా …?

ఇరాన్‌తో యుద్ధానికి తెరపడే సమయం.. 15 సూత్రాల శాంతి ప్రణాళికను పంపిన అమెరికా

అమెరికా యుద్ధ విరమణ ప్రతిపాదనలకు ఎండ్ కార్డు పడుతుందా …?

ఇరాన్‌తో నెల రోజులుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా కీలక ముందడుగు వేసింది. యుద్ధాన్ని నిలిపివేసి, అణు కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేసేందుకు 15 సూత్రాలతో కూడిన ఒక విస్తృత ప్రణాళికను ఇరాన్‌కు పంపింది. మరోవైపు, ఒక ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇరాన్ సిద్ధంగా ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం.. ఈ ప్రతిపాదనలను పాకిస్థాన్, టర్కీ, ఈజిప్ట్ వంటి మధ్యవర్తుల ద్వారా ఇరాన్‌కు చేరవేశారు. ఈ ప్రణాళిక ప్రకారం ఇరాన్ తన మూడు ప్రధాన అణు కేంద్రాలైన నతాంజ్, ఇస్ఫహాన్, ఫోర్డోలను పూర్తిగా మూసివేయాలి. యురేనియం శుద్ధిని నిలిపివేసి, ఇప్పటివరకు శుద్ధి చేసిన అణు ఇంధనాన్ని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (IAEA)కు అప్పగించాలి. బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాన్ని కూడా నిలిపివేయాలని అమెరికా డిమాండ్ చేసింది.

ఈ షరతులకు అంగీకరిస్తే ఇరాన్‌పై విధించిన అన్ని అణు సంబంధిత ఆంక్షలను ఎత్తివేస్తామని అమెరికా హామీ ఇచ్చింది. అంతేకాకుండా, విద్యుత్ ఉత్పత్తి కోసం బుషెహర్‌లో పౌర అణు కార్యక్రమాన్ని అభివృద్ధి చేయడానికి మద్దతు ఇస్తామని తెలిపింది. ఆంక్షలను తిరిగి విధించే “స్నాప్‌బ్యాక్” విధానాన్ని కూడా రద్దు చేస్తామని పేర్కొంది.

ఈ అంశంపై అధ్యక్షుడు ట్రంప్ మంగళవారం మాట్లాడుతూ “వారు ఒక ఒప్పందం చేసుకోవాలనుకుంటున్నారు. అణ్వాయుధాన్ని ఎప్పటికీ సమకూర్చుకోకుండా ఉండేందుకు అంగీకరించారు” అని పేర్కొన్నారు. అయితే, దౌత్యపరమైన ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, ఇజ్రాయెల్, కువైట్, సౌదీ అరేబియా వంటి దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగిస్తోందని, ఇరు దేశాల మధ్య ఇంకా చాలా దూరం ఉందని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.  

యుద్ద విరమణకు ఇరాన్ షరతులు…

కాల్పుల విరమణ చర్చలను తిరిగి ప్రారంభించేందుకు ఇరాన్ అత్యంత కఠినమైన షరతులను అమెరికా ముందు ఉంచింది. గల్ఫ్‌లోని అమెరికా సైనిక స్థావరాలన్నింటినీ పూర్తిగా మూసివేస్తేనే చర్చలకు సిద్ధమని స్ప‌ష్టం చేసింది. ఈ మేరకు అమెరికాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ తన కథనంలో వెల్లడించింది. ఇరాన్‌లో ఇటీవల బలపడిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఈ చర్చల వైఖరిని నిర్దేశిస్తున్నట్లు ఈ నివేదిక పేర్కొంది.

ఇరాన్ కేవలం సైనిక స్థావరాల మూసివేతతోనే సరిపెట్టలేదు. తమపై అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడుల వల్ల జరిగిన నష్టానికి పూర్తి పరిహారం చెల్లించాలని కూడా డిమాండ్ చేస్తోంది. వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య ప్రస్తుతం ప్రత్యక్ష చర్చలు జరగడం లేదు. పశ్చిమాసియాలోని మధ్యవర్తుల ద్వారా ఇరు దేశాలు పరోక్షంగా తమ సందేశాలను ఇచ్చిపుచ్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ తన డిమాండ్ల జాబితాను పంపింది.

ఇరాన్ ప్రధాన డిమాండ్లు ఇవే..
* గల్ఫ్‌లోని అమెరికా సైనిక స్థావరాలన్నీ మూసివేయాలి.
* తమపై జరిగిన దాడులకు అమెరికా, ఇజ్రాయెల్ నష్టపరిహారం చెల్లించాలి.
* వ్యూహాత్మకమైన హర్మూజ్ జలసంధిపై తమకు నియంత్రణ ఇవ్వాలి. సూయజ్ కెనాల్ తరహాలో ఈ మార్గం గుండా వెళ్లే నౌకల నుంచి రుసుము వసూలు చేసే అధికారం కల్పించాలి.
* భవిష్యత్తులో ఎలాంటి దాడులు జరగవని హామీ ఇవ్వాలి.
* ఇరాన్ మిత్రపక్షమైన లెబనీస్ మిలీషియా హెజ్‌బొల్లాపై ఇజ్రాయెల్ దాడులను ఆపాలి.
* తమపై విధించిన అన్ని ఆర్థిక ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలి.
* తమ క్షిపణి కార్యక్రమాన్ని పరిమితం చేసే ఎలాంటి చర్చలు ఉండకూడదు.

అయితే, ఇరాన్ పెడుతున్న ఈ షరతులు “హాస్యాస్పదంగా, అవాస్తవికంగా” ఉన్నాయని అమెరికా అధికారులు కొట్టిపారేసినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం పేర్కొంది. ఇరాన్ ఇంత కఠిన వైఖరితో ఉండటంతో ఇరు దేశాల మధ్య సయోధ్య కుదరడం గతంలో కంటే మరింత కష్టతరం కావచ్చని అరబ్, అమెరికా అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇరాన్ డిమాండ్లతో చర్చలకు దిగుతుండటంతో దౌత్యపరమైన మార్గాలు మరింత సంక్లిష్టంగా మారాయి.

Related posts

మళ్లీ తడబడిన బైడెన్.. డెమోక్రాట్లలో టెన్షన్…

Ram Narayana

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ బోణీ.. కాంస్యం సాధించిన షూటర్ మను భాకర్!

Ram Narayana

లండన్ లో తెలుగు యవకుడి మృతి

Ram Narayana