బీజేపీ నేతలు కలలు కంటున్నారు.. మరో 20 ఏళ్లు కేసీఆరే సీఎం!: గుత్తా సుఖేందర్ రెడ్డి
-ఈటలను పార్టీలోకి ఎలా తీసుకున్నారో కిషన్ రెడ్డి చెప్పాలి
-రాష్ట్రంపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు తోడేళ్ల మాదిరి దాడి చేస్తున్నారు
-కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు చందాలు అడుగుతున్నారు
-కిషన్ రెడ్డిది జన వంచన యాత్ర: సీపీఐ రామకృష్ణ
-ఏపీకి అడుగడుగునా అన్యాయమేనని వ్యాఖ్యలు
-ఏపీ బీజేపీ నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు
తెలంగాణలో అధికారంలోకి వస్తామని బీజేపీ నేతలు కలలు కంటున్నారని టీఆర్ఎస్ సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు. మరో 20 ఏళ్లు టీఆర్ఎస్ పార్టీనే అధికారంలో ఉంటుందని… ముఖ్యమంత్రిగా కేసీఆరే ఉంటారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో ఒక్కటైనా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలవుతోందా? అని ప్రశ్నించారు. పేదల కోసం ఏం చేశారో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డి అబద్ధాలు చెపుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.
అసైన్డ్ భూములను తీసుకున్నానని ఒప్పుకున్న ఈటల రాజేందర్ ను పార్టీలోకి ఎలా తీసుకున్నారో బీజేపీ నేతలు చెప్పాలని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు తోడేళ్ల మాదిరి దాడి చేస్తున్నారని చెప్పారు. మన దేశాన్ని బీజేపీ అప్పుల కుప్పగా మార్చిందని విమర్శించారు. దళితులకు కాంగ్రెస్ వాళ్లు కూడా చేసిందేమీ లేదని చెప్పారు. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో సామాజిక న్యాయం అమలవుతోందని అన్నారు. రాజకీయ నాయకులు మాట్లాడే భాష హుందాగా ఉండాలని… జుగుప్సాకరంగా మాట్లాడవద్దని చెప్పారు.
కొత్తగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చందాలు అడుగుతున్నారని… కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హైదరాబాదును కూడా అమ్మేస్తారని గుత్తా దుయ్యబట్టారు. ఇలాంటి వారు చెప్పే మాటల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. మతాన్ని వాడుకుంటూ బీజేపీ నేతలు పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని చెప్పారు.
కిషన్ రెడ్డిది జన వంచన యాత్ర: సీపీఐ రామకృష్ణ
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి చేపట్టిన జన ఆశీర్వాద యాత్రపై సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ విమర్శనాత్మకంగా స్పందించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కిషన్ రెడ్డిది జన వంచన యాత్ర అని ఆయన అభివర్ణించారు. మోదీ సర్కారు ఏపీకి అడుగడుగునా అన్యాయం చేసిందని అన్నారు. కార్పొరేట్ శక్తులకు మోదీ ప్రభుత్వం కొమ్ముకాస్తోందని వ్యాఖ్యానించారు.
ఏపీ అప్పులు చేసిందని చెబుతున్న కేంద్రం ఏడేళ్లలో రూ.47 లక్షల కోట్ల నుంచి రూ.119 లక్షల కోట్లకు అప్పులు పెంచడాన్ని ఏమనాలి? అని రామకృష్ణ ప్రశ్నించారు. కేంద్రం తీరుపై ఏపీ బీజేపీ నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు.