Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
సినిమా వార్తలు

సినిమా టికెట్ రేట్లను నిర్ణయించే హక్కు ప్రభుత్వాలకు లేదు.. హీరో సిద్ధార్థ్ మండిపాటు!

సినిమా టికెట్ రేట్లను నిర్ణయించే హక్కు ప్రభుత్వాలకు లేదు.. హీరో సిద్ధార్థ్ మండిపాటు
-సినిమా కన్నా మద్యం, పొగాకు ఉత్పత్తులకే గౌరవం ఇస్తున్నారు
-తాము వ్యాపారం ఎలా చేయాలో ఎవరూ డిసైడ్ చేయాల్సిన అవసరం లేదు
-సినిమా చూడాలంటూ ఎవరూ అడగట్లేదు
-చాలా మంది పైరసీ సినిమాలు చూస్తున్నారు

సినిమా రేట్ల విషయంలో ప్రభుత్వాల జోక్యంపై హీరో సిద్ధార్థ్ అసహనం వ్యక్తం చేశారు. సినిమా టికెట్ల ధరలను, పార్కింగ్ చార్జీలను నిర్ణయించే నైతిక హక్కు ప్రభుత్వాలు, రాజకీయ నాయకులకు లేదని అన్నారు. ట్విట్టర్ లో ఆయన ఈ మేరకు స్పందించారు. తాను 25 ఏళ్ల క్రితం తొలిసారి విదేశాల్లో తన స్టూడెంట్ ఐడీ కార్డు చూపించి సినిమా చూశానని, అప్పుడు టికెట్ ధర కేవలం రూ.200 ఉండేదని గుర్తు చేశారు. ఇప్పుడు మన సినిమాలు ప్రపంచంలోని అన్ని సినిమాల్లాగే సాంకేతికత, నైపుణ్యం, ఉపాధి విషయంలో ఏం తక్కువ లేదని చెప్పారు.

ప్రభుత్వాలు సినిమా కన్నా మద్యం, పొగాకు ఉత్పత్తులకు మంచి గౌరవం ఇస్తున్నాయని విమర్శించారు. తమ వ్యాపారం ద్వారానే లక్షలాది మంది ఉపాధి పొందుతున్నారని చెప్పారు. తాము వ్యాపారం ఎలా చేసుకోవాలో ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదన్నారు. పన్నులు వేయండి.. సినిమాలను లాజిక్ లేకుండా సెన్సార్ చేయండి.. ఏదైనా చేయండి.. కానీ, టికెట్ రేట్లను తగ్గించి నిర్మాతలు, ఉపాధి పొందుతున్న వారి పొట్ట మీద కొట్టరాదని డిమాండ్ చేశారు.

సినిమాలు చూడండంటూ ఎవరూ ఎవరినీ అడగడం లేదని, చాలా మంది పైరసీ చూస్తూ తమకు ఉచితంగా సినిమాలు కావాలని అడుగుతున్నారని మండిపడ్డారు. అలాంటి వారికి సినీ పరిశ్రమ నుంచి ఎలాంటి సబ్సిడీలు అందబోవని స్పష్టం చేశారు. కోట్లు సంపాదించే ప్రతి సినీ నిర్మాతకు.. జీతాలు చెల్లించాల్సిన ఎంతో మంది ఉద్యోగులు, ఇన్వెస్టర్లుంటారని చెప్పారు. డబ్బున్నోళ్ల గురించే మాట్లాడాల్సి వస్తే.. ప్రతి రంగంలోనూ ఉన్నారని అన్నారు. కేవలం సినీ పరిశ్రమ మీద పడి ఏడ్వడం దేనికని ప్రశ్నించారు.

సినిమా బడ్జెట్, దాని పరిధిని ప్రేక్షకుడు ఎలా నిర్ణయిస్తాడని, వారికి ఆ అధికారం లేదని అన్నారు. దానిని నిర్ణయించే అధికారం నిర్మాత, దర్శకులకే ఉందని సిద్ధార్థ్ చెప్పారు. ఎవరెంత సంపాదించాలన్నదీ ప్రేక్షకుడు నిర్ణయించజాలడన్నారు. పేదవారిగా జీవితాన్ని మొదలుపెట్టి.. కోటీశ్వరులుగా కన్నుమూసిన రాజకీయనాయకులు, వ్యాపారవేత్తలనూ దీనిపై ప్రశ్నించగలరా అని ప్రశ్నించారు. సినీ పరిశ్రమను వేధించడం ఆపండంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమకు తిండి విలువ, దానిని పండించే రైతు గొప్పదనం తెలుసన్నారు. వారి కోసం తాము ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉంటామన్నారు. వారికన్నా తాము గొప్పవాళ్లం కాకపోయినా.. తామూ మనుషులమేనని, పన్నులు చెల్లిస్తున్నవారిమేనని అన్నారు. ఎదుటి వారిని ఉల్లాసపరిచేందుకు తాము కళను సృష్టిస్తూ తమను తాము పోషించుకుంటున్నామని సిద్ధార్థ్ చెప్పారు. అలాంటి చెయ్యిని నరికే ప్రయత్నం చేయొద్దని విజ్ఞప్తి చేశారు.

ఇటీవల ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ ధరలను నిర్ణయించిన సంగతి తెలిసిందే. కనీస ధరను రూ.5గా నిర్ణయించింది. దీనిపై ఇప్పటికే చిరంజీవి వంటి అగ్రహీరోలు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు వంటి వారు స్పందించారు. తాజాగా సిద్ధార్థ్ కూడా పరోక్షంగా దానిపై అసహనం వ్యక్తం చేశారు.

Related posts

డ్రగ్స్ కేసు ఎఫెక్ట్… ‘మా’ నుంచి నటి హేమ సస్పెన్షన్?

Ram Narayana

క్షేమంగానే నటి సరళకుమారి.. హైదరాబాద్‌కు చేర్చాలంటూ అమెరికా నుంచి ఆమె కుమార్తె విజ్ఞప్తి

Ram Narayana

జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించిన ప్రకాశ్ రాజ్…

Drukpadam

Leave a Comment