- కర్ణాటక కాంగ్రెస్ లో ఊహించని సన్నివేశం
- హవేరీలో సిద్ధరామయ్య నిలువెత్తు విగ్రహాన్ని ఆవిష్కరించిన డీకే
- సిద్ధరామయ్య ప్రజా నాయకుడని కితాబు
కర్ణాటక రాజకీయాల్లో డీకే శివకుమార్, సిద్ధరామయ్య మధ్య సీఎం పదవి కోసం గత కొంత కాలంగా ఒక రకమైన పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో, తాజాగా ఓ ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. కర్ణాటకలోని హవేరీలో జరిగిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నిలువెత్తు విగ్రహాన్ని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్వయంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు ఉందనే ప్రచారానికి పూర్తి చెక్ పెట్టినట్లు కనిపిస్తోంది.
సిద్ధరామయ్య నాయకత్వంలో కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ విగ్రహావిష్కరణ జరిగింది. పార్టీలో ఐక్యతను, సమష్టి కృషిని ప్రజలకు చాటడమే ఈ కార్యక్రమం లక్ష్యమని డీకే శివకుమార్ స్పష్టం చేశారు. గ్యారంటీ పథకాల అమలులో సిద్ధరామయ్య పోషించిన పాత్రను కొనియాడుతూ, ఆయన చరిత్రలో ప్రజా నాయకుడిగా నిలిచిపోతారని అన్నారు.
విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత సిద్ధరామయ్యకు డీకే శివకుమార్ ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇద్దరూ ఒకే వేదికపై కనిపించడం, ఒకరినొకరు గౌరవించడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. సిద్ధరామయ్య సైతం తన విగ్రహాన్ని డీకే ఆవిష్కరించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇది తన వ్యక్తిగత గౌరవం మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీ సమష్టి కృషికి దక్కిన గుర్తింపని ఆయన వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి పదవి రేసులో ఎప్పుడూ పోటీపడే ఈ ఇద్దరు నేతల మధ్య ఇలాంటి ఐక్యతను చూపడం రాష్ట్ర రాజకీయాలకు కొత్త సంకేతంగా మారింది. ఈ విగ్రహావిష్కరణ పార్టీలో ఐక్యతను బలపరిచినట్లు కనిపిస్తోంది.
Save or share this story as a newspaper-style Epaper Clip: