ఢిల్లీ ఎర్రకోట తనదేనంటూ కోర్టును ఆశ్రయించిన మహిళ!
- ఢిల్లీ హైకోర్టులో ఆసక్తికర పిటిషన్
- మొఘలుల చివరి వారసుడి భార్యనంటూ పిటిషన్
- నష్టపరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి
- ఇన్నాళ్లు ఏంచేశారన్న కోర్టు
- తన క్లయింటు నిరక్షరాస్యురాలన్న పిటిషనర్ న్యాయవాది
- పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు
ఢిల్లీ హైకోర్టులో ఓ ఆసక్తికరమైన పిటిషన్ దాఖలైంది. దేశ రాజధాని హస్తినలో ఉన్న ఎర్రకోట తనదేనంటూ ఓ మహిళ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఆమె పేరు సుల్తానా బేగం. ఆమె తనను తాను మొఘలుల చివరి రాజు బహదూర్ షా మునిమనవడు మీర్జా మహ్మద్ బీదర్ భక్త్ భార్యనని చెప్పుకుంటోంది. ఎర్రకోటను తనకు అప్పగించడమో, లేక తగిన పరిహారం చెల్లించడమో చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ తన పిటిషన్ లో కోరింది.
పిటిషనర్ సుల్తానా బేగం స్పందిస్తూ, ఢిల్లీ రాజు బహదూర్ షా జాఫర్-2కు తానే నిజమైన వారసురాలినని ఉద్ఘాటించింది. “1857లో బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ వర్గాలు బహదూర్ షాను పదవీచ్యుతుడిని చేశాయి. బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ ఆయన ఆస్తులన్నింటినీ అక్రమంగా లాగేసుకుంది. 1960లో భారత ప్రభుత్వం బహదూర్ షా జాఫర్-2 వారసుడిగా బీదర్ భక్త్ పేరును పేర్కొంది” అని ఆమె వివరించింది.
ఆ బీదర్ భక్త్ తన భర్తేనని, ఆయన మరణానంతరం 1980 ఆగస్టు 15 నుంచి భారత ప్రభుత్వం తనకు పెన్షన్ ఇవ్వసాగిందని సుల్తానా బేగం కోర్టుకు తెలిపింది. ఆ పెన్షన్ తమకు ఏ మూలకు సరిపోవడంలేదని విచారం వ్యక్తం చేసింది. అంతేగాకుండా, కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ ఎర్రకోటను అక్రమంగా తన అధీనంలో ఉంచుకుందని, అది తమ పూర్వీకుల ఆస్తి అని ఆమె పేర్కొంది. అందుకే ఎర్రకోటను తమకు అప్పగించాలని కోరుతున్నామని, 1857 నుంచి వర్తించేలా నష్టపరిహారం చెల్లించాలని ఆమె కోర్టును డిమాండ్ చేసింది.
అయితే ఈ పిటిషన్ ను జస్టిస్ రేఖా పల్లీ ధర్మాసనం కొట్టివేసింది. ఇన్నాళ్లు ఏంచేశారంటూ ధర్మాసనం పిటిషనర్ ను ప్రశ్నించింది. ఈ సందర్భంగా సుల్తానా బేగం తరఫు న్యాయవాది స్పందిస్తూ, తన క్లయింటు నిరక్షరాస్యురాలని, అందుకే కోర్టును ఆశ్రయించలేదని వివరించే ప్రయత్నం చేశారు. ఈ వివరణ తమకు ఆమోదయోగ్యం కాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు.