సినిమా టికెట్ల ధరలపై మంత్రి పేర్ని నానితో థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్ల భేటీ!
- సచివాలయంలోని ఐదో బ్లాక్‌లో చర్చలు
- సినిమా థియేటర్లు మూసివేత పరిస్థితులు వచ్చాయని వ్యాఖ్య
- తమకు తీవ్ర నష్టాలు వస్తున్నాయని వివరణ
ఏపీలో సినిమా టికెట్ల ధరలు, థియేటర్లలో తనిఖీలు, నిబంధనల ఉల్లంఘనల పేరిట దాడులు, మూసివేత వంటి అంశాలపై వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. దీంతో ఏపీ మంత్రి పేర్ని నానితో సినిమా థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు ఆయా అంశాలపై చర్చించడానికి అపాయింట్‌మెంట్ కోరడంతో అందుకు ఆయన అంగీకరించారు.
దీంతో పేర్ని నానితో థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు ఈ రోజు సమావేశం అయ్యారు. అమరావతి సచివాలయంలోని ఐదో బ్లాక్‌లో ఈ చర్చలు కొనసాగుతున్నాయి. సినిమా టికెట్ల ధరల తగ్గుదల వల్ల సినిమా థియేటర్లు మూసివేసే పరిస్థితులు వచ్చాయని వారు మంత్రితో చెప్పారు. తమకు తీవ్ర నష్టాలు వస్తున్నాయని అన్నారు. తనిఖీల వల్ల ఎలా నష్టపోతున్నదీ కూడా వారు మంత్రికి వివరిస్తున్నట్లు తెలిసింది.
కరోనా నేపథ్యంలో నిర్వహణ వ్యయం కూడా పెరిగిందని, టికెట్ల ధరలను తగ్గిస్తే థియేటర్లను కొనసాగించలేమని వారు తెలిపారు. ఈ సమావేశం అనంతరం ఏపీలో సినిమా టికెట్ల ధరలు, థియేటర్లలో తనిఖీలు, నిబంధనల ఉల్లంఘనల అంశాలపై ప్రభుత్వ విధానంపై పేర్ని నాని మీడియా సమావేశంలో మాట్లాడి వివరించే అవకాశం ఉంది.
హీరోలు నాని, సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నాని స్పందన
ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారం టాలీవుడ్ ప్రముఖులు వర్సెస్ వైసీపీ నేతలు అన్నట్టుగా తయారైంది. ఇటీవల హీరో నాని స్పందిస్తూ, థియేటర్ల కలెక్షన్ల కంటే పక్కనే ఉన్న కిరాణా కొట్లకే వసూళ్లు ఎక్కువగా వస్తున్నాయని వ్యాఖ్యానించారు. మరో హీరో సిద్ధార్థ్ మరింత ఘాటుగా స్పందిస్తూ, తాము కట్టే పన్నులతో ఏపీ మంత్రులు లగ్జరీగా బతుకుతున్నారంటూ తీవ్ర విమర్శలు చేశాడు.
ఈ వ్యాఖ్యలపై నేడు ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని స్పందించారు. హీరో నాని ఏ కిరాణా కొట్టు లెక్కలు చూసి వ్యాఖ్యానించారో, ఏ కిరాణా కొట్టు కలెక్షన్లు నాని దృష్టికి వచ్చాయో తనకు తెలియదని పేర్కొన్నారు.
సిద్థార్థ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ… “రాజకీయనేతలు విలాసవంతంగా బతుకుతున్నారని హీరో సిద్ధార్థ్ అంటున్నారు. అయినా సిద్ధార్థ్ ఎక్కడ ఉంటున్నాడు? తమిళనాడులో! ఏపీతో ఆయనకేంటి సంబంధం? ఈ రాష్ట్రంలో ఆయన చెల్లించే ట్యాక్సులు ఏమున్నాయి? మేం ఏవిధంగా బతుకుతున్నామో సిద్ధార్థ్ కు ఏంతెలుసు?” అంటూ ప్రశ్నించారు.