Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

దేశంలో తొలి ఒమిక్రాన్ మరణం.. మహారాష్ట్రలో నమోదు

దేశంలో తొలి ఒమిక్రాన్ మరణం.. మహారాష్ట్రలో నమోదు
-వైరాలజీ ఇనిస్టిట్యూట్ పరీక్షలో పాజిటివ్ గా నిర్ధారణ
-నైజీరియా నుంచి వచ్చిన వ్యక్తి
-ఇతర ఆరోగ్య సమస్యల వల్లేనన్న అధికారులు

దేశంలో కరోనా ఒమిక్రాన్ వైరస్ కారణంగా తొలిసారి ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మహారాష్ట్రలోని పింప్రి చిన్వాడ్ ప్రాంతానికి చెందిన 52 ఏళ్ల వ్యక్తి గుండెపోటుతో చనిపోయినట్టు అధికార యంత్రాంగం ప్రకటించింది. అతడికి కరోనా ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే, అధికారులు మాత్రం అతను ఒమిక్రాన్ కారణంగా చనిపోలేదని, ఇతర అనారోగ్య సమస్యల వల్ల ప్రాణాలు కోల్పోయాడని పేర్కొంటున్నారు.

యశ్వంత్ రావు చవాన్ ఆసుపత్రిలో సదరు బాధితుడు కరోనాకు చికిత్స పొందుతూ ఈ నెల 28న మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. నైజీరియా నుంచి రావడంతో కరోనా బారిన పడ్డాడు. ‘‘రోగికి 13 ఏళ్ల నుంచి మధుమేహం సమస్య ఉంది. అతడు కరోనాయేతర కారణాలతో మరణించాడు. ఒమిక్రాన్ రకం ఇన్ఫెక్షన్ బారినపడినట్టు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ రిపోర్ట్ తెలియజేసింది’’ అని అధికారులు ప్రకటన విడుదల చేశారు.

తెలంగాణలో ఒమిక్రాన్ సామాజిక వ్యాప్తి ప్రారంభమైంది: రాష్ట్ర హెల్త్ డైరెక్టర్

రానున్న రోజుల్లో రోజుకు 50 వేల కేసులు నమోదు కావచ్చు
రెండు, మూడు రోజులుగా కేసులు పెరుగుతున్నాయి
డెల్టా కంటే ఒమిక్రాన్ ఆరు రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోంది
ఒమిక్రాన్ లక్షణాలు 90 శాతం మందిలో కనిపించవు
తక్కువ నష్టంతో బయటపడాలంటే.. కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలి
థర్డ్ వేవ్ కు న్యూఇయర్, సంక్రాంతి వేడుకలు ప్రారంభ ఘడియల్లాంటివి

తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ సామాజిక వ్యాప్తి ప్రారంభమైందని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డాక్టర్ జి.శ్రీనివాసరావు వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా విషయంలో ప్రతి ఒక్కరూ ఎంతో జాగ్రత్తగా ఉండాలని, బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. ప్రజలు అజాగ్రత్తతో వ్యవహరిస్తే పరిస్థితి చేజారుతుందని హెచ్చరించారు. గత రెండు, మూడు రోజులుగా కేసుల సంఖ్యలో పెరుగుదల ఉందని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో కేసులు పెరుగుతున్నాయని వెల్లడించారు. రానున్న రెండు నుంచి నాలుగు వారాలు అత్యంత కీలకమని చెప్పారు.

రానున్న కొన్ని వారాల్లో పెద్ద సంఖ్యలో కేసులు నమోదయ్యే అవకాశం ఉందని శ్రీనివాసరావు తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయని… రానున్న రోజుల్లో కేసుల ఉద్ధృతి ఐదు రెట్లు (50 వేలు) పెరిగే అవకాశం ఉందని చెప్పారు. గతంలో ఎన్నడూ నమోదు కాని స్థాయిలో కేసులు నమోదవుతాయని హెచ్చరించారు.

డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ ఆరు రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోందని శ్రీనివాసరావు తెలిపారు. మనమంతా తక్కువ నష్టంతో బయటపడాలంటే… ప్రతి ఒక్కరూ కచ్చితంగా కోవిడ్ నిబంధనలను పాటించాలని సూచించారు. కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. థర్డ్ వేవ్ కు న్యూఇయర్, సంక్రాంతి వేడుకలు ప్రారంభ ఘడియల్లాంటివని… ఈ వేడుకలను సామూహికంగా కాకుండా ఇంట్లో కుటుంబసభ్యులతోనే జరుపుకోవాలని హితవు పలికారు. మాస్క్ కచ్చితంగా ధరించాలని సూచించారు.

ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు 90 శాతం మందిలో కనిపించవని… వీరికి ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా… వీరి వల్ల వైరస్ వ్యాప్తి జరుగుతుందని డాక్టర్ శ్రీనివాసరావు హెచ్చరించారు. మిగిలిన 10 శాతం మందిలో 9 శాతం మంది ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం లేదని… ఇంటి వద్దే ఉంటూ ఐసొలేషన్ కిట్ లోని మందులను వాడితే సరిపోతుందని చెప్పారు. అయితే, మిగిలిన ఒక శాతం మంది మాత్రం వైరస్ తీవ్రతతో హాస్పిటల్స్ లో చేరాల్సిన పరిస్థితి ఉంటుందని తెలిపారు. మన వద్ద సమర్థవంతమైన ఔషధాలు ఉన్నాయని, భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు.

వైరస్ ఒమిక్రానా? డెల్టానా? అనే విషయం గురించి ఎవరూ ఆలోచించవద్దని… కరోనా మాదిరిగానే చూడాలని అన్నారు. గతంలో కోవిడ్ బారిన పడిన వారిలో 3 నుంచి 5 శాతం మందికి మళ్లీ కరోనా వచ్చే అవకాశం ఉందని చెప్పారు. థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Related posts

కరోనా థర్డ్ వేవ్ అనివార్యం… ఉదాసీనత వద్దంటూ కేంద్రాన్ని హెచ్చరించిన ఐఎంఏ…

Drukpadam

కరోనాతో మరణిస్తే రూ.50వేల పరిహారం…

Drukpadam

దేశీయ, అంతర్జాతీయ విమానాలను నిషేధించిన నేపాల్

Drukpadam

Leave a Comment