విద్యాసంస్థలకు సెలవులు పొడిగింపు..!
కరోనా కేసులు పెరుగుతుండటమే కారణం
సెలవులను పొడిగిస్తే మేలని వైద్య ఆరోగ్య శాఖ నివేదిక
రేపు ప్రకటన వచ్చే అవకాశం!
కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు మరికొంత కలం పొడిగించే యోచనలో తెలంగాణ సర్కార్ ఉన్నట్లు సమాచారం . అయితే ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించలేదు . రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాత్రం పాఠశాలలకు మరికొన్ని రోజులు సెలవులు ఇవ్వాలని సర్కార్ కు నివేదిక ఇచ్చింది. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు .
రాష్ట్రంలో విద్యా సంస్థలకు సెలవులను పొడిగించే అవకాశం కనిపిస్తోంది.కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం సంక్రాంతి సెలవులను మూడు రోజులు ముందుకు జరిపి ఈనెల 8వ తేదీ నుంచి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈనెల 16 వరకు సెలవులు ఉండగా..17న విద్యా సంస్థలు తెరవాల్సి ఉంది. కేసులు తగ్గకపోవడంతో మరికొద్ది రోజులు సెలవులను పొడిగించనున్నారని సమాచారం. సెలవులను పొడిగిస్తే మేలని వైద్య ఆరోగ్య శాఖ కూడా ప్రభుత్వానికి సూచించనున్నట్లు తెలిసింది. ఈనెల 20వ తేదీ వరకు రాష్ట్రంలో ర్యాలీలు, సభలను జరపరాదని 9న ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దాంతో సెలవులను కూడా మొదట 20వ తేదీ వరకు పొడిగిస్తారని చెబుతున్నారు. ఎక్కువ రోజులు పొడిగిస్తే సర్కారు పాఠశాలలు, జూనియర్ కళాశాలల విద్యార్థులకు టీవీల ద్వారా ఆన్‌లైన్ పాఠాలను ప్రసారం చేయాల్సి ఉంటుంది. లేకుంటే అటు ప్రత్యక్ష తరగతులు లేవు…ఇటు ఆన్‌లైన్ పాఠాలు లేవన్న విమర్శ వస్తుందని అధికారులు చెబుతున్నారు. పాఠశాల విద్యాశాఖ వర్గాలు మాత్రం ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలను అమలు చేస్తామని చెబుతున్నాయి. అయితే సెలవులను పొడిగిస్తారా? లేదా? అనేది త్వరగా ప్రకటిస్తే సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లిన వారు తిరిగి రావాలా? అక్కడే ఉండాలా? అన్నది నిర్ణయించుకుంటారన్న అభిప్రాయాన్ని కొందరు తల్లిదండ్రులు వ్యక్తంచేస్తున్నారు.
గాంధీ ఆస్పత్రికి మళ్లీ కోవిడ్ బాధితులు క్యూ
గాంధీ ఆస్పత్రికి మళ్లీ కోవిడ్ బాధితులు పోటెత్తుతున్నారు. ఆస్పత్రిలో శుక్రవారం ఒక్కరోజే 28 మంది చేరారు. ఇన్‌పేషెంట్ వార్డుల్లో సుమారు 70 నుంచి 80 మంది మాత్రమే ఉండగా, తాజాగా ఈ సంఖ్య 111కు చేరింది. ఫలితంగా మెయిన్ బిల్డింగ్‌లోని సెకండ్ ఫ్లోర్ రోగులతో పూర్తిగా నిండిపోవడంతో కొత్తగా వచ్చే రోగుల కోసం మూడో వార్డును సిద్దం చేస్తున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్లో 11 మంది గర్భిణులు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు.
వీరిలో మరో ఎనిమిది మంది బ్లాక్‌ఫంగస్ బాధితులు కూడా ఉన్నారు. తగ్గినట్లే తగ్గిన ఇన్‌పేషంట్ల సంఖ్య మళ్లీ క్రమంగా పెరుగుతుండటంతో ఆస్పత్రి వైద్యులు అప్రమత్తమయ్యారు. సాధారణ అడ్మిషన్లను, సర్జరీలను నిలిపివేశారు. గచ్చిబౌలిలోని టిమ్స్‌లోనూ ఇన్‌పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం అక్కడ వంద మందికిపైగా చికిత్స పొందుతున్నారు. వీరిలో ఎక్కువగా ఒమిక్రాన్ బాధితులే.