ఫిబ్రవరి 16 నుంచి మేడారం మహా జాతర…
-కోటిన్నరమందికి పైగా భక్తులు వస్తారని అంచనా!
-19 వరకు నాలుగు రోజుల పాటు నిర్వహణ
-రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.75 కోట్లు
-మంత్రి సత్యవతి రాథోడ్ ప్రకటన
-మాస్క్ లు ధరించి రావాలని సూచన
గిరిజన ప్రజల ఆరాధ్య దేవతలు కొలువుదీరిన మేడారంలో మహా జాతర ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరగనుంది. దీనికి కోటిన్నర మందికి పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. కాకపోతే ఈ విడత కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో జాతర జరగనుండడం సర్కారుకు ప్రతిష్ఠాత్మకం కానుంది. దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా భావిస్తన్న మేడారం జాతరకు నాలుగు ,ఐదు రాష్ట్రాల నుంచి ఈ జాతరకు ప్రజలు లక్షలాదిగా తరలివస్తారు . మేడారం ప్రాంతమంతా జనంతో కిక్కిరిసి పోతుంది . ఇప్పటికే తెలంగాణ సర్కార్ జాతరకు కావలసిన ఏర్పాట్లను చేసింది. కరోనా మహమ్మారి దృష్ట్యా ఇక్కడకు వచ్చే భక్తులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ చెబుతూ, భక్తుల కోసం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. జాతరకు రూ.75 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసినట్లు చెప్పారు. భక్తులందరూ మాస్క్ లు ధరించి రావాలని ఆమె సూచించారు. ప్రభుత్వం తరఫున మాస్క్ లను భక్తులకు పంపిణీ చేస్తామని ప్రకటించారు.
ఇక అర గంటలో దర్శనం పూర్తయ్యే విధంగా ప్రణాళికలను అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ విడత దేశ, విదేశీ భక్తులు ఎక్కువ మంది రావచ్చని మంత్రి రాథోడ్ పేర్కొన్నారు. 8 వేలకు పైగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేస్తున్నామని, ట్రాఫిక్ రద్దీకి తగిన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
రెండేళ్లకోసారి జాతర జరుగుతుంటుంది. తెలంగాణతోపాటు మహారాష్ట్ర, చత్తీస్ గఢ్, ఏపీ, ఒడిశా రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు జాతరకు వస్తుంటారు. ఫిబ్రవరి 16న సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను గద్దెలపైకి తీసుకువస్తారు. 17న చిలకలగుట్ట నుంచి సమ్మక్కను కూడా గద్దెలపైకి తీసుకొస్తారు. 18న భక్తులు మొక్కులు తీర్చుకునే కార్యక్రమం ఉంటుంది. 19న అమ్మవార్ల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది.