Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

సీఎం వైఎస్ జగన్ కి సినీ నటుడు కైకాల లేఖ!

నా ఆరోగ్యం పట్ల మీరు చూపిన శ్రద్ధ, సహాయం మరువ లేనిది !: సీఎం వైఎస్ జగన్ కి సినీ నటుడు కైకాల లేఖ
-నవంబర్లో అనారోగ్యం పాలైన కైకాల
-ప్రభుత్వం నుంచి జగన్ భరోసా
-వైద్య ఖర్చులను భరించిన ఏపీ ప్రభుత్వం
-పూర్తిగా కోలుకున్న కైకాల
-కృతజ్ఞతలు తెలుపుతూ వైఎస్ జగన్ కి లేఖ

కైకాల సత్యనారాయణ పేరు చెప్పగానే గంభీరమైన రూపం .. ఆ రూపానికి తగిన వాయిస్ తో ఆయన డైలాగ్స్ చెప్పే తీరు .. కళ్లముందు కదలాడుతాయి. ‘సిపాయి కూతురు’ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన ఆయన, ఆ తరువాత కెరియర్ పరంగా వెనుదిరిగి చూసుకోలేదు. ఎస్వీఆర్ తరువాత అంతటి నటుడు అనిపించుకున్నారు. వందల సినిమాలతో .. విలక్షణమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న ఆయన, నవంబరులో తీవ్రమైన అనారోగ్యానికి లోనయ్యారు. ఆ సమయంలో ఆయనను హైదరాబాద్ – అపోలో ఆసుపత్రిలో చేర్పించారు.

కైకాల వైద్యానికి సంబంధించిన సమస్త ఖర్చులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరిస్తుందని ముఖ్యమంత్రి జగన్ అప్పుడు భరోసా ఇచ్చారు. అప్పటి నుంచి జగన్ ఎప్పటికప్పుడు కైకాల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుంటూ వచ్చారు. ఏపీ ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలోనే ఆయన వైద్యం కొనసాగింది. చాలా రోజుల తరువాత అనారోగ్యం బారి నుంచి పూర్తిగా కోలుకున్న కైకాల, అనారోగ్య సమయంలో తనకి అండగా నిలిచి పూర్తిస్థాయి సహాయ సహకారాలను అందించిన వై ఎస్ జగన్ కి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక లేఖ రాశారు.

“మీరు ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా నాకు కాల్ చేసి, ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలను అందిస్తామని హామీ ఇచ్చారు. మీరు చూపించిన అభిమానానికి .. మీరు కనబరిచిన ప్రత్యేక శ్రద్ధకు నాకు చాలా సంతోషం కలిగింది. మీరు హామీ ఇచ్చినట్టుగానే, మీ ఉన్నతాధికారులు వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఆర్ధిక సాయంతో పాటు .. అన్ని రకాలుగా తమ సహాయ సహకారాలను అందించారు. కష్ట సమయంలో మీరు అందించిన సహాయం నా కుటుంబానికి ఎంతో శక్తినిచ్చింది.

మీరు చూపించిన ఈ శ్రద్ధ, కళాకారుల పట్ల .. వారి శ్రేయస్సు పట్ల మీకు గల అభిమానాన్ని మరోసారి రుజువు చేసింది. ప్రజల పట్ల మీకు ఉన్న శ్రద్ధ .. రాష్ట్రం మంచి చేతుల్లో ఉందనే భరోసాను కలిగిస్తోంది” అని కైకాల ఈ లేఖలో పేర్కొన్నారు. తన అనారోగ్య సమయంలో తన కుటుంబానికి అండగా నిలిచిన అభిమానులందరికీ కూడా ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. వాళ్లందరి ప్రార్ధనల కారణంగానే తాను పూర్తిగా కోలుకున్నానని ఆయన అన్నారు.

Related posts

లాల్‌జాన్‌బాషా సోదరుడు జియావుద్దీన్ టీడీపీకి రాజీనామా..

Drukpadam

కాంగ్రెస్ లో చేరుతున్నారనే ప్రచారం పై ఈటల మండిపాటు…

Drukpadam

ఈనెల 8 ప్రధాని మోడీ బహిరంగ సభను జయప్రదం చేయండి …పొంగులేటి

Drukpadam

Leave a Comment