ఎవరినైతే అరెస్ట్ చేయించాలని సిద్ధూ ఎంతో ప్రయత్నించాడో… అసెంబ్లీ ఎన్నికల్లో అతనే ఆయనకు ప్రత్యర్థి!
- అమృత్ సర్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సిద్ధూ
- ఆయనపై బిక్రమ్ మజీథియాను పోటీలో నిలిపిన అకాలీదళ్
- డ్రగ్స్ కేసులో బిక్రమ్ ను అరెస్ట్ చేయించేందుకు యత్నించిన సిద్ధూ
వచ్చే నెల పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి రాజకీయాలు వేడెక్కాయి. పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ అమృత్ సర్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనకు ప్రత్యర్థిగా బిక్రమ్ మజీథియాను అకాలీదళ్ బరిలోకి దింపింది. అమృత్ సర్ తూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా బిక్రమ్ పేరును ఈరోజు ప్రకటించింది.
మరోవైపు డ్రగ్స్ కేసులో బిక్రమ్ ను అరెస్ట్ చేయించేందుకు సిద్ధూ ఎంతో ప్రయత్నించారు. ఆయనకు వ్యతిరేకంగా ఎంతో ప్రచారం చేశారు. ఇప్పుడు ఎన్నికల్లో ఆయనే తన ప్రత్యర్థిగా రావడం గమనార్హం. అమృత్ సర్ తూర్పు నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యేగా సిద్ధూ ఉన్నారు. 2017 ఎన్నికల్లో బలమైన ప్రత్యర్థులు లేకపోవడంతో సిద్ధూ సునాయాసంగా గెలుపొందారు.
ఈ ఎన్నికల్లో బిక్రమ్ రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. 2012, 2017 ఎన్నికల్లో ఆయన అమృత్ సర్ లోని మజీథియా నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఇప్పుడు ఆ స్థానంతో పాటు సిద్ధూపై కూడా పోటీ చేస్తున్నారు.
డ్రగ్స్ కేసులో గత డిసెంబర్ లో బిక్రమ్ పై కేసు నమోదైంది. అయితే, హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారాయన. మరోవైపు సిద్ధూ, బిక్రమ్ ఇద్దరూ పోటీ పడుతుండటంతో పంజాబ్ లో ఈ నియోజకవర్గం ఉత్కంఠను రేకెత్తిస్తోంది.