Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కడప పై సోము వీర్రాజు వ్యాఖ్యలు …శ్రీకాంత్ రెడ్డి ఫైర్!

కడప పై సోము వీర్రాజు వ్యాఖ్యలు …శ్రీకాంత్ రెడ్డి ఫైర్!
కడప జిల్లా ప్రజలు హత్యలు చేసేవాళ్లలా కనిపిస్తున్నారా ఆగ్రహం
సోము వీర్రాజు వ్యాఖ్యలు వివాదాస్పదం
సిగ్గులేకుండా మాట్లాడుతున్నారన్న శ్రీకాంత్ రెడ్డి
గతంలో చంద్రబాబూ ఇలాగే మాట్లాడారని ఆరోపణ
సోము క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్

నిన్న విశాఖలో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మాట్లాడిన మాటలు వివాదాస్పదం అయ్యాయి. కడపలో తాము ఎయిర్ పోర్టు కట్టించామని, ప్రాణాలు తీసేవాళ్ల ప్రాంతంలోనూ ఎయిర్ పోర్టులు నిర్మించామని సోము వీర్రాజు అన్నారు. దీనిపై ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి భగ్గుమన్నారు. కడప ప్రజలు హత్యలు చేసేవాళ్లు అంటూ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు గర్హనీయం అన్నారు.

సోము వీర్రాజు కడప జిల్లా ప్రజల మనోభావాలను గాయపరిచారని మండిపడ్డారు. రాయలసీమ సంస్కృతి తెలియకపోతే చరిత్ర చదవాలే తప్ప, ఇలా సిగ్గులేకుండా మాట్లాడరాదని అన్నారు. గతంలో చంద్రబాబు కూడా కడప రౌడీలు, గూండాలు అని మాట్లాడారని ఆరోపించారు. కలెక్షన్ల కోసం సినిమాల్లో ఫ్యాక్షన్ ను చూపిస్తూ, దుష్ప్రచారం చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.

ప్రతి ఒక్కరినీ గౌరవించే నైజం కడప ప్రజల సొంతమని, తమ కడుపు కాల్చుకుని ఎదుటివాళ్ల కడుపు నింపే తత్వం కడప ప్రజలదని వెల్లడించారు. క్రైమ్ ఎక్కువగా ఎక్కడ ఉందో పోలీస్ రికార్డుల్లో చూడాలని హితవు పలికారు. సోము వీర్రాజు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, కడప జిల్లా ప్రజలందరికీ క్షమాపణలు చెప్పాలని శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

కడప ప్రజల గురించి ఎక్కడా తప్పుగా మాట్లాడలేదు : సోము వీర్రాజు

కడపలో ఎయిర్ పోర్టును నిర్మించామని, ప్రాణాలు తీసేసే వాళ్ల ప్రాంతంలోనూ తాము (కేంద్ర ప్రభుత్వం) ఎయిర్ పోర్టులు కట్టించామని తాను అన్న వ్యాఖ్యలను వైసీపీ నేతలు వక్రీకరిస్తున్నారని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఆరోపించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యను దృష్టిలో ఉంచుకుని ఆ వ్యాఖ్యలు చేశానే తప్ప, కడప ప్రజలను కించపరిచేలా మాట్లాడలేదని స్పష్టం చేశారు. కడప జిల్లా ప్రజలకు, హత్యారాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. విశాఖలో నిన్న తాను చేసిన వ్యాఖ్యలను వివాదాస్పదం చేస్తున్నారని మండిపడ్డారు.

ఎయిర్ పోర్టులు నిర్మిస్తాం అంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై తాను స్పందించానని సోము వీర్రాజు వివరణ ఇచ్చారు. ఎయిర్ పోర్టుల సంగతి మేం (కేంద్రం) చూసుకుంటాం గానీ, ముందు మీరు రోడ్లు వేసుకోండి అంటూ హితవు పలికానని తెలిపారు. ఈ సందర్భంగానే తాను పైవ్యాఖ్యలు చేశానని, సొంత బాబాయిని చంపినవారికి శిక్షలు పడకుండా సీఎం జగన్ రక్షిస్తున్నారంటూ మీడియాలో వస్తున్న వార్తల ఆధారంగానే మాట్లాడానని పేర్కొన్నారు.

తాను మాట్లాడింది కొందరు వ్యక్తులను దృష్టిలో ఉంచుకుని మాత్రమేనని, తన మనసులో కడప జిల్లా ప్రజలపై ఎలాంటి దురభిప్రాయంలేదని అన్నారు. తనకు కడప జిల్లా ప్రజల ప్రేమాభిమానాలు, ఆప్యాయతానురాగాలు, సంస్కృతీ సంప్రదాయాలు, నమ్మితే ప్రాణమిచ్చే తెగింపు బాగా తెలుసని వెల్లడించారు. ఈ విషయంలో కడప జిల్లా ప్రజలకు మరెవరూ సాటిరారని సోము వీర్రాజు కొనియాడారు.

కడప జిల్లా ప్రజలకు మోసం చేయడం తెలియదని, కానీ సీఎం జగన్ కుటుంబాన్ని ఆదరిస్తూ పదేపదే మోసపోతుంటారని తెలిపారు. కడప జిల్లా ప్రజలు ఇకనైనా వారి మాయ నుంచి బయటపడి అభివృద్ధి వైపు పయనించాలని కోరుకుంటున్నానని అన్నారు.

కడప జిల్లాకు ఎయిర్ పోర్టుతో పాటు అనేక జాతీయ రహదారులను నిర్మించింది కేంద్ర ప్రభుత్వమేనని, వెనుకబడిన జిల్లా కింద కడపకు వందల కోట్ల నిధులు ఇచ్చి అభివృద్ధికి కృషి చేస్తోంది మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వమేనని సోము వీర్రాజు ఉద్ఘాటించారు. వైసీపీ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని కడప జిల్లా ప్రజలను అభ్యర్థిస్తున్నాను అంటూ వీడియో సందేశం వెలువరించారు.

Related posts

భట్టి ఆరోపణలపై మంత్రి పువ్వాడ మండిపాటు

Drukpadam

ఆర్టీసీ ఎం డి గా వి సి సజ్జనార్ …అభినందనలు తెలిపిన మంత్రి పువ్వాడ!

Drukpadam

అమరావతి రైతుల పాదయాత్రపై ప్రభుత్వం, రైతుల పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు

Drukpadam

Leave a Comment