Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రీడా వార్తలు

1000వ వన్డేలో విజయం… 28 ఓవర్లలో టార్గెట్ ఛేదించిన టీమిండియా!

1000వ వన్డేలో విజయం… 28 ఓవర్లలో టార్గెట్ ఛేదించిన టీమిండియా!

తొలి వన్డేలో రోహిత్ సేన జయభేరి

  • వెస్టిండీస్ పై 6 వికెట్ల తేడాతో విక్టరీ
  • 51 బంతుల్లో 60 రన్స్ చేసిన రోహిత్
  • రాణించిన సూర్యకుమార్, దీపక్ హుడా

రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన వేళ తన 1000వ వన్డే మ్యాచ్ ని టీమిండియా చిరస్మరణీయం చేసుకుంది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా వెస్టిండీస్ తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో, వెస్టిండీస్ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కేవలం 28 ఓవర్లలో ఛేదించింది.

ఈ ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ ఆటే హైలెట్. ఓపెనర్ గా బరిలో దిగిన రోహిత్ శర్మ 51 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు, ఒక సిక్స్ తో 60 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ 28 పరుగులు చేయగా, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కేవలం 8 పరుగులే చేసి నిరాశపరిచాడు. రిషబ్ పంత్ (11) రనౌట్ రూపంలో వెనుదిరిగాడు.

అయితే, మిడిలార్డర్ లో సూర్యకుమార్ యాదవ్ (34 నాటౌట్), దీపక్ హుడా (26 నాటౌట్) ఎలాంటి తడబాటు లేకుండా మ్యాచ్ ను ముగించారు. దీపక్ హుడాకు ఇదే తొలి అంతర్జాతీయ వన్డే మ్యాచ్. విండీస్ బౌలర్లలో పేసర్ అల్జారీ జోసెఫ్ 2, స్పిన్నర్ అకీల్ హోసీన్ 1 వికెట్ తీశారు.

అంతకుముందు, టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ జట్టు 43.5 ఓవర్లలో 176 పరుగులకు ఆలౌటైంది. జాసన్ హోల్డర్ 57 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

కాగా, ఈ మ్యాచ్ లో విజయంతో టీమిండియా మూడు వన్డేల సిరీస్ లో 1-0తో ముందంజ వేసింది. ఇరుజట్ల మధ్య రెండో వన్డే ఈ నెల 9న ఇదే మైదానంలో జరగనుంది.

Related posts

సురేశ్ రైనాను తీసుకోకపోవడంపై వివరణ ఇచ్చిన చెన్నై సూపర్ కింగ్స్!

Drukpadam

ఐపీఎల్ మిగిలిన మ్యాచ్ లు యూఏఈలో!

Drukpadam

ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేతలకు రూ.41.60 లక్షల ప్రైజ్!

Ram Narayana

Leave a Comment