తెలంగాణను మళ్లీ ఏపీలో చేర్చేందుకు మోదీ కుట్ర: హరీశ్ రావు
-తెలంగాణపై మోదీ మరోసారి అక్కసు వెళ్లగక్కారు
-అమరవీరుల త్యాగాలను కించపరిచారు
-తెలంగాణలో బీజేపీకి నూకలు చెల్లాయి
ఆంధ్రప్రదేశ్ విభజనపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. తెలంగాణపై మోదీ మరోసారి అక్కసు వెళ్లగక్కారని, అమరవీరుల త్యాగాలను కించపరిచారని విమర్శించారు. తెలంగాణను మళ్లీ ఆంధ్రాలో కలపాలని మోదీ కుట్ర చేస్తున్నట్టుగా ఆయన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయని చెప్పారు. బీజేపీ తెలంగాణాలో అధికారంలోకి రావాలని కలలు కంటుందని ధ్వజమెత్తారు. అంతకు ముందు కాస్తో కూస్తో ఉన్న బీజేపీ ఇమేజ్ ని మోడీ డేమేజ్ చేశారని ఇక తెలంగాణాలో బీజేపీకి నూకలు చెల్లాయని అన్నారు . తెలంగాణను ప్రజాస్వామ్య పద్దతిలో విడగొట్టలేదని చర్చలేకుండానే విడగొట్టారని మోడీ మాటల వెనక దురుద్దేశాలు ఉన్నాయని ఆరోపించారు .
ఇక తెలంగాణలో బీజేపీకి నూకలు చెల్లాయని, తెలంగాణ ఏర్పాటుపై మోదీ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర బీజేపీ నేతలు ఎలా సమర్థిస్తారని ప్రశ్నించారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ అభివృద్ధిపథంలో దూసుకుపోతూనే ఉంటుందని అన్నారు. వలస కార్మికుల వల్లే కరోనా వ్యాప్తి చెందిందని మోదీ అనడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. కుంభమేళా, ఎన్నికల ర్యాలీలు, ట్రంప్ సభలను నిర్వహించినప్పుడు కరోనా పెరగలేదా? అని ప్రశ్నించారు.