ప్రధాని మోదీ ఇంట్లో ఒక పాపకు సుష్మా స్వరాజ్ పేరు.. అదెలా పెట్టారంటే…!
- ఆసక్తికర విషయాన్ని పంచుకున్న ప్రధాని
- 25 ఏళ్ల క్రితం గుజరాత్ కు వెళ్లిన సుష్మా
- అమ్మతో ప్రధాని మోదీ భేటీ
- అప్పుడే మోదీ కుటుంబంలో ఆడ శిశువు జననం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కుటుంబంలో ఒకరికి బీజేపీ దివంగత నేత సుష్మా స్వరాజ్ పేరు పెట్టారు. ఇందుకు సంబంధించి ఆసక్తికరమైన విషయాన్ని ప్రధాని మోదీయే స్వయంగా పంచుకున్నారు. ఈ నెల 14న సుష్మా స్వరాజ్ 70వ జయంతి. విదేశాంగ శాఖ సహా పలు కీలక శాఖలకు మంత్రిగా ఆమె పనిచేశారు. కేంద్రంలో బీజేపీ రెండో విడత అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే 2019 ఆగస్ట్ 6న గుండెపోటుతో మరణించడం తెలిసిందే.
ఇదిలావుంచితే, పంజాబ్ లోని జలంధర్ లో ఎన్నికల ర్యాలీలో పాల్గొని తిరిగి వస్తున్న సమయంలో ప్రధాని మోదీ సుష్మాను గుర్తు చేసుకుంటూ, ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ పెట్టారు.
‘‘25 ఏళ్ల క్రితం నేను బీజేపీలో ఆర్గనైజర్ గా పనిచేస్తున్న సమయం. ఎన్నికల పర్యటనలో భాగంగా సుష్మా స్వరాజ్ గుజరాత్ కు వచ్చారు. ఆ సమయంలోనే మా స్వగ్రామం వాద్ నగర్ కు వెళ్లారు. మా అమ్మను కూడా కలిశారు. ఆ సమయంలో మా మేనల్లుడికి కుమార్తె జన్మించింది. జ్యోతిషకారులు ఒక పేరును నిర్ణయించారు. ఆ పేరు మా కుటుంబానికి కూడా నచ్చింది.
అయితే, సుష్మాజీతో భేటీ తర్వాత మా బేబీని సుష్మా అని పిలవాలంటూ మా అమ్మ చెప్పింది. మా అమ్మ పెద్దగా చదువుకోలేదు. కానీ, ఆలోచనలు మాత్రం ఆధునికంగా ఉంటాయి. ఆ సమయంలో ఆమె తన నిర్ణయాన్ని మా అందరికీ చెప్పిన విధానం నాకు ఇప్పటికీ గుర్తుంది. అలా మా ఇంటి పాపకు సుష్మా అనే పేరు స్థిరపడిపోయింది’’ అని మోదీ పేర్కొన్నారు.