ఎర్రకోటపై ‘కాషాయ జెండా’ ఎగరేస్తామన్న కర్ణాటక మంత్రి.. అసెంబ్లీలో నిద్ర చేసి నిరసన తెలిపిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
- మంత్రి ఈశ్వరప్పపై కర్ణాటక ఎమ్మెల్యేల మండిపాటు
- నిన్న రాత్రి నుంచి అసెంబ్లీలోనే నిరసనలు
- దేశద్రోహం కేసు పెట్టి బర్తరఫ్ చేయాలని డిమాండ్
- జీవితాంతం అసెంబ్లీలోనే ఉండనివ్వండంటూ ఈశ్వరప్ప స్పందన
- ఈశ్వరప్ప వ్యాఖ్యల్లో తప్పేం లేదన్న కర్ణాటక సీఎం
కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. ఎర్రకోటపై త్రివర్ణపతాకానికి బదులు ‘కాషాయ జెండా’ ఎగరేసే రోజులు వస్తాయని ఆ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె.ఎస్. ఈశ్వరప్ప ఇటీవల వ్యాఖ్యానించారు. దానికి నిరసనగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిన్న అసెంబ్లీలో నిరసన చేపట్టారు. ఆయన్ను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ నిన్న రాత్రి మొత్తం అక్కడే నిద్ర చేశారు. శుక్రవారం ఉదయం కూడా నిరసనలను కొనసాగించారు.
ఈశ్వరప్పపై వెంటనే దేశద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. జాతీయ పతాకంపై మంత్రి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని ఆక్షేపించారు. ఈశ్వరప్పను డిస్మిస్ చేసే దాకా తమ ఆందోళనలను ఆపే ప్రసక్తే లేదని కాంగ్రెస్ కర్ణాటక అధ్యక్షుడు డి.కె. శివకుమార్ ఇవాళ తేల్చి చెప్పారు. ఆయనేం రాజీనామా చేయాల్సిన అవసరం లేదని, గవర్నర్, ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ వాళ్లకు జాతీయ జెండా ముఖ్యం కాదని, ఈశ్వరప్ప వ్యాఖ్యలను జనాల్లోకి తీసుకెళ్తామని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎం.బి. పాటిల్ చెప్పారు.
వారి నిరసనలపై మంత్రి ఈశ్వరప్ప స్పందించారు. ‘‘వాళ్లు ఎన్నాళ్లు అసెంబ్లీలో ఉంటారో ఉండనివ్వండి. జీవితాంతం అక్కడే ఉండమనండి. నేనేమన్నానో శివకుమార్ కు మరోసారి వినిపించండి. నేనెప్పుడూ త్రివర్ణాన్ని అవమానించలేదు’’ అని స్పష్టం చేశారు. ఎవరో డిమాండ్ చేసినంత మాత్రాన తాను రాజీనామా చేసేది లేదని, ఎమర్జెన్సీ సమయంలో తాను కూడా జైలుకు వెళ్లానని, తాను దేశభక్తుడినని పేర్కొన్నారు. ఆ మాటకొస్తే కాంగ్రెస్ నేతలే జాతీయ పతాకాన్ని అవమానిస్తున్నారని, నిరసనల్లో జెండాను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.
సీఎం బసవరాజ్ బొమ్మై కూడా కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేతలు ప్రజా వ్యతిరేకులన్నారు. ఇంతకుముందు కూడా వాళ్లు ఇలాగే అసెంబ్లీలో నిద్రపోయి నిరసనలు చేశారని, వారికి ప్రజల సమస్యలుగానీ, రైతుల సమస్యలుగానీ, రాష్ట్ర ప్రయోజనాలుగానీ అవసరమే లేదని అన్నారు. ఈశ్వరప్ప చట్టానికి వ్యతిరేకంగా ఏమీ వ్యాఖ్యలు చేయలేదని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యల్లో తప్పులేదన్నారు. ఏ కారణం లేకుండానే అసెంబ్లీలో రాత్రంతా నిరసన చేపట్టడం విడ్డూరమన్నారు. దీని ద్వారా రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.