చర్చలద్వారానే సమస్య పరిస్కారం అంటున్న దేశాలు…
యుద్ధం విరమించాలని రెండు దేశాలకు విజ్ఞప్తి
ఉక్రెయిన్ సైన్యం సరెండర్ కలసిందే అంటున్న రష్యా
రష్యా, ఉక్రెయిన్‌ల యుద్ధంపై చైనా కీలక ప్రకటన
ఇరు దేశాలు చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలి
ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనేందుకు కృషి
చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ప్రకటన
తాలిబాన్లది అదేమాట ,భారత్ నిన్ననే శాంతిద్వారా పరిష్కరించుకోవాలని సూచన
రష్యా, ఉక్రెయిన్ల మధ్య కొనసాగుతున్న యుద్ధంపై ప్రపంచ దేశాలు స్పందించడం మొదలెట్టాయి. ఇప్పటికే నాటో దేశాలతో పాటు అమెరికా కూడా తన వైఖరిని స్పష్టం చేసింది. తాజాగా ప్రపంచంలో మరో అగ్రదేశంగా పరిగణిస్తున్న చైనా కూడా ఈ యుద్ధంపై స్పందించింది.
రష్యా, ఉక్రెయిన్ దేశాలు తమ సమస్యను పరిష్కరించుకునేందుకు చర్చలనే ఆశ్రయించాలని చైనా అభిప్రాయపడింది. ఈ మేరకు చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ కాసేపటి క్రితం ఓ కీలక ప్రకటనను విడుదల చేశారు. చర్చల ద్వారానే రష్యా, ఉక్రెయిన్లు సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పిన జిన్ పింగ్.. ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కూడా ప్రకటించారు.
ఇదిలావుంచితే, ఉక్రెయిన్‌పై ఇప్పటికే భీకర దాడులకు రష్యా పాల్పడుతోంటే..ఆ దాడులను తిప్పికొట్టేందుకు ఉక్రెయిన్ కూడా హోరాహోరీగానే పోరాడుతోంది. ఇలాంటి సమయంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు సిద్ధమంటూ ప్రకటన చేయడం గమనార్హం.
మరోవైపు..యుద్ధం జరుగుతున్న వేళ శుక్రవారం నాడు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఫోన్ చేశారు. ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న సంక్షోభ పరిస్థితులపై పుతిన్‌తో జిన్ పింగ్ చర్చించినట్లు సమాచారం.
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధంపై తాలిబన్ల కీలక ప్రకటన!
ఉక్రెయిన్ సంక్షోభం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తోంది. యుద్ధాన్ని ఆపాలంటూ రష్యాకు పలు దేశాలు విన్నవిస్తున్నాయి. భారత ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ఫోన్ చేసి యుద్ధాన్ని ఆపాలని కోరిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశంపై ఆఫ్ఘనిస్థాన్ ను పాలిస్తున్న తాలిబన్లు సైతం స్పందించారు.
రెండు దేశాలు సంయమనాన్ని పాటించాలని తాలిబన్ ప్రభుత్వం ఓ ప్రకటనలో కోరింది. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. ఉక్రెయిన్ లో తమ విద్యార్థులు చదువుకుంటున్నారన్న తాలిబన్లు… విద్యార్థుల రక్షణపై ఆందోళన వ్యక్తం చేసింది. యుద్ధం వల్ల ప్రాణాలు కోల్పోతున్న ప్రజల గురించి ఆవేదన వ్యక్తం చేసింది.
ఆయుధాలు వదిలితే చర్చలు.. ఉక్రెయిన్‌కు రష్యా ఆఫర్
ఉక్రెయిన్‌తో యుద్ధంపై కాసేపటి క్రితం రష్యా కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్ సైన్యం ఆయుధాలు వదిలితే.. ఆ దేశంతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధమేనని రష్యా సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీలారోవ్ కాసేపటి క్రితం ఓ ప్రకటన విడుదల చేశారు.
సెర్గీలారోవ్ ప్రకటన ప్రకారం.. ఉక్రెయిన్ సైన్యం తక్షణమే పోరాటం ఆపాలి. తమ చేతుల్లోని ఆయుధాలను వదిలేయాలి. ఆపై రష్యా సైన్యానికి లొంగిపోవాలి. మొత్తంగా ఉక్రెయిన్ సైన్యం తమకు సరెండర్ అయిపోతేనే ఆ దేశ ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధమని రష్యా ప్రకటించింది. మరి ఈ ప్రకటనపై ఉక్రెయిన్ అధ్యక్షుడు ఎలా స్పందిస్తారో చూడాలి.