రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధంపై భద్రతా మండలిలో ఓటింగ్.. దూరంగా ఉన్న భారత్!
- ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం
- రష్యా చర్యలను ఖండిస్తూ అమెరికా తీర్మానం
- చైనా, యూఏఈ కూడా ఓటింగ్‌కు దూరం
- వీటో అధికారాన్ని ఉపయోగించిన రష్యా
- మండలిలో వీగిపోయిన తీర్మానం
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి మరోసారి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. రష్యా దుందుడుకు చర్యలను ఖండిస్తూ భద్రతా మండలి ఓటింగ్ నిర్వహించగా దీనికి భారత్ దూరంగా ఉండిపోయింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తూ అమెరికా ఈ ప్రతిపాదన చేయగా, మొత్తం 15 సభ్యదేశాల్లో 11 దేశాలు రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేశాయి.
ఇందులో అమెరికా, యూకే, ఫ్రాన్స్, నార్వే, ఐలాండ్, అల్బానియా, గాబాన్, మెక్సికో, బ్రెజిల్, ఘనా, కెన్యా ఉన్నాయి. అమెరికా ప్రతిపాదనకు వ్యతిరేకంగా రష్యా ఓట్ వేసింది. ఇక మిగతా మూడు దేశాలైన భారత్, చైనా, యూఏఈ ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. ఉక్రెయిన్-రష్యా యుద్ధం విషయంలో భారత్ మొదటి నుంచి తటస్థ వైఖరిని అవలంబిస్తోన్న విషయం తెలిసిందే.
కాగా, భద్రతా మండలిలోని 5 శాశ్వత దేశాల్లో రష్యా ఒకటిగా ఉండడం, తన వీటో అధికారాన్ని ఉపయోగించడంతో ఆ తీర్మానం వీగిపోయింది. ఈ సందర్భంగా ఐరాసలోని భారత రాయబారి టీఎస్ తిరుమూర్తి మీడియాతో మాట్లాడుతూ సభ్య దేశాలకు పలు సూచనలు చేశారు. వివాదాల పరిష్కారం కోసం సభ్య దేశాలు చర్చలు జరపాలని ఆయన చెప్పారు.
ప్రస్తుత పరిణామాల విషయంలో భారత్ తీవ్ర ఆందోళనకు గురవుతోందని ఆయన అన్నారు. హింసాత్మక చర్యలను ఆపేందుకు ప్రయత్నాలు చేయాలని కోరుతున్నామని వ్యాఖ్యానించారు. కాగా, రష్యాకు చైనా పరోక్షంగా మద్దతు తెలుపుతుండడంతో ఆ దేశం ఓటింగ్ కు దూరంగా ఉంది.