-లెఫ్టనెంట్ గవర్నర్ కు మరిన్ని అధికారాలు
-విపక్షాల నిలమద్యే రాజ్యసభలో బిల్లు ఆమోదం
-బిల్లును వ్యతిరేకించిన వైసీపీ ,బీజేడీ ,టీఎంసీ ,ఎస్పీ
విపక్షాల నిరసనలు, అరుపులు, వాకౌట్ల మధ్య నేషనల్ క్యాపిటల్ టెర్రిటరీ ఆఫ్ ఢిల్లీ (అమెండ్ మెంట్) బిల్లును రాజ్యసభ ఆమోదించింది. ఈ బిల్లు ఇప్పటికే లోక్ సభలో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు మరిన్ని అధికారాలు కల్పిస్తూ ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.
మరోవైపు ఈ బిల్లును ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు విపక్షాలు గట్టిగా ఎదిరించాయి. ఈ బిల్లు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని వాదించాయి. బిల్లును తొలుత సెలెక్ట్ కమిటీకి పంపించాలని డిమాండ్ చేశాయి. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, బిల్లు రాజ్యాంగ విరుద్ధం కాదని చెప్పారు. రాజ్యాంగానికి లోబడే బిల్లును తీసుకొచ్చామని తెలిపారు. ఈ బిల్లును వ్యతిరేకించిన పార్టీల్లో బీజేడీ, సమాజ్ వాదీ, టీఎంసీ తదితర పార్టీలతో పాటు వైసీపీ కూడా ఉంది.
పార్లమెంటు ఉభయసభలు బిల్లుకు ఆమోదముద్ర వేయడంతో… దీన్ని రాష్ట్రపతి వద్దకు పంపనున్నారు. ఆయన సంతకం చేసిన తర్వాత ఇది చట్టరూపం దాలుస్తుంది. ఆ తర్వాత ఢిల్లీ ప్రభుత్వానికి అధికారాలు పూర్తిగా తగ్గిపోనున్నాయి. లెఫ్టినెంట్ గవర్నర్ ప్రమేయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కార్యనిర్వాహక నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి తలెత్తుతుంది.