ఏపీకి ప్రత్యేక హోదా లేదు.. మరోమారు కేంద్రం స్పష్టీకరణ
-ప్రత్యేక హోదాపై వైసీపీ ఎంపీ ప్రశ్న
-ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమన్న కేంద్రం
-విభజన చట్టంలోని చాలా హామీలను నెరవేర్చినట్లు వెల్లడి
ఏపీకి ప్రత్యేక హోదా లేదని కేంద్ర ప్రభుత్వం మరోమారు తేల్చి చెప్పేసింది. ఇప్పటికే ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అంశమని పార్లమెంటు సాక్షిగానే తెలిపిన కేంద్రం.. తాజాగా మరోమారు మరింత స్పష్టంగా ఏపీకి ప్రత్యేక హోదా లేదంటూ క్లిస్టర్ క్లియర్‌గా ప్రకటించేసింది. ఈ మేరకు వైసీపీ ఎంపీ సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు మంగళవారం నాడు కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
గతంలో ఏపీకి ప్రత్యేక హోదాపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు కేంద్రాన్ని నిలదీసిన సంగతి తెలిసిందే. ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అంశమని నాడు కేంద్రం తేల్చి చెప్పింది. తాజాగా వైసీపీ ఎంపీ అడిగిన ప్రశ్నకు కూడా అదే రీతిన సమాధానం చెప్పిన కేంద్రం.. ప్రత్యేక హోదాకు బదులుగా ఏఏ రకాల సాయాలను అందించామన్న విషయాన్ని ప్రస్తావించింది.
14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదాను సిఫారసు చేయలేదని తెలిపిన నిత్యానందరాయ్.. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచామని తెలిపారు. విభజన చట్టంలోని చాలా హామీలను ఇప్పటికే నెరవేర్చామని కూడా ఆయన చెప్పారు. మొత్తంగా ఏపీకి ప్రత్యేక హోదా లేదని మరోమారు కేంద్రం తేల్చి చెప్పేసింది.