ఢిల్లీలోని జగన్ నివాసం వద్ద భారీ బందోబస్తు..
-ఢిల్లీలో అమరావతి రైతుల జేఏసీ ప్రతినిధులు
-కేంద్ర మంత్రులతో భేటీ కోసమే ఢిల్లీ వెళ్లిన వైనం
-జగన్ నివాసం వద్ద ఆందోళనకు దిగుతారని అనుమానం
-జన్‌పథ్ సమీపంలో వాహనాల రాకపోకలు రద్దు
అమరావతి రైతులు రాజధాని అమరావతి లోనే కొనసాగించాలని కోరుతూ కేంద్ర మంత్రులను కలిసేందుకు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలుస్తున్నారు . వారు ఢిల్లీలో ఉండగానే సీఎం ఢిల్లీ పర్యటన ఖరారు కావడంతో ఢిల్లీ లోని సీఎం నివాసం వద్ద రైతులు నిరసన తెలిపే అవకాశం ఉందని సమాచారం ఉండటంతో ఢిల్లీ పోలీసులు ఏపీ సీఎం నివాసం వద్ద భారీ బందో బస్తు ఏర్పాటు చేశారు .
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెందిన ఢిల్లీ నివాసం వద్ద మంగళవారం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కోసం మంగళవారం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. మంగళవారం సాయంత్రానికే జగన్ ఢిల్లీ చేరుకోగా… జగన్ ఢిల్లీ చేరుకోవడానికి కాస్తంత ముందుగా జగన్ నివాసం ఉన్న జనపథ్ పరిసరాల్లో వాహనాల రాకపోకలను రద్దు చేశారు.
జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లిన రోజే రాజధాని అమరావతి రైతులు కూడా ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులతో భేటీ కోసమే అమరావతి రైతులు ఢిల్లీకి వెళ్లగా.. వారు జగన్ నివాసం వద్ద నిరసన తెలిపే అవకాశముందన్న భావనతో పోలీసులు జగన్ నివాసం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనితో పరిసరాలకు కూడా ఎవరిని అనుమతించకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు.