ఒకరోజు ముందే పసుపు పండుగ.. నేడు భారీ ర్యాలీతో ఒంగోలు చేరుకున్న చంద్రబాబు ..
ప్రతిష్టాత్మకంగా మహానాడు నిర్వహణకు ఏర్పాట్లు
ప్రభుత్వ విధానాలను ఎండగట్టేలా ప్రణాళికలు
తెలుగుదేశం పార్టీ నలభై వసంతాల పండుగకు సర్వం సిద్ధమవుతోంది.
-రెండు రోజుల పాటు జరిగే మహానాడు కార్యక్రమంతోపాటు.. పొలిట్ బ్యూరో సమావేశం కూడా ప్రకాశం జిల్లాలోనే నిర్వహించాలని నిర్ణయించడంతో.. ఒక రోజు ముందుగానే పండుగ మొదలుకానుంది. మహానాడు సన్నాహక కార్యక్రమం నేడు ప్రారంభంకానుంది. ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. ఒక రోజు ముందుగానే… భారీ ర్యాలీతో ఇవాళ ఒంగోలు చేరుకున్నారు . సాయంత్రం జరిగే పొలిట్‌బ్యూరో సమావేశంలో.. మహానాడు అజెండాతో పాటు..రానున్న రోజుల్లో పార్టీపరంగా అనుసరించే రాజకీయ విధానాలను ఖరారు చేయనున్నారు.
వరుసగా మూడేళ్లు మహానాడుకు భౌతికంగా దూరంగా ఉన్న తెలుగుదేశం శ్రేణులు… ఈసారి పండుగను విజయవంతం చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. మూడేళ్ల వైకాపా పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని భావిస్తున్న తెలుగుదేశం.. దానిని మహానాడు వేదికగా తమకు అనుకూలంగా మలచుకోవడంతో పాటు.. ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని భావిస్తోంది.
మహానాడు నిర్వహణ పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడుతున్న తెలుగుదేశం..ప్రజాక్షేత్రంలో తమ సత్తా చాటేందుకు.. మహానాడు విజయవంతం చేయడాన్ని సవాలుగా తీసుకుంది. ఇందులో భాగంగా పార్టీ అధినేత చంద్రబాబు…. ఒకరోజు ముందుగానే ఒంగోలుకు బయలుదేరారు . పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ నుంచి అధినేత చంద్రబాబు వెంట భారీ ద్విచక్ర వాహనర్యాలీతో ఒంగోలు కు చేరుకున్నారు .
చంద్రబాబు ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించిన దగ్గర నుంచి..భారీ ర్యాలీతో స్వాగతం స్థానిక నేతలు స్వాగతం పలికారు . మహానాడు నిర్వహణకు మినీ స్టేడియం అడిగితే అనుమతులు నిరాకరించడం, వాహనాలు ఇవ్వొద్దంటూ ఆర్టీసీ సహా ప్రైవేట్ ట్రావెల్స్, విద్యాసంస్థలపై ప్రభుత్వం ఒత్తిడి తేవడం, ఒంగోలులో పసుపు తోరణాల తొలగింపు వంటి పరిణామాలను చంద్రబాబు సహా పార్టీ నాయకులు తీవ్రంగా పరిగణించారు.
అమరావతి కేంద్రంగా నిర్వహించాలనుకున్న పొలిట్‌బ్యూరో సమావేశ వేదికను.. ఒంగోలుకు మార్చారు. మహానాడు ప్రారంభం రోజు మాత్రమే.. ఆ ప్రాంతానికి వచ్చే సంస్కృతికి స్వస్తి పలికి.. ఒక రోజు ముందే అక్కడ మకాం వేయాలని నిర్ణయించారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా..తమ వెంట ప్రజాబలం ఉందని చాటేలా.. వ్యూహరచన చేసుకున్నారు.
చంద్రబాబు వెంట పార్టీ కేంద్రకార్యాలయం నుంచి శ్రేణులు..పెద్దఎత్తున బైక్ ర్యాలీ తో తరలి వెళ్లాయి . మంగళగిరి, కాకాని, గుంటూరు, చిలకలూరిపేట, అద్దంకి క్రాస్‌రోడ్, మేదరమెట్ల, ఒంగోలు పరిసరాల నుంచి కూడా.. చంద్రబాబు కాన్వాయ్ వెంట తెలుగు తమ్ముళ్లు… బైక్ ర్యాలీలో కలవనున్నారు. ఒంగోలు చేరుకున్నాక…. సాయంత్రం చంద్రబాబు పొలిట్‌బ్యూరో సమావేశం నిర్వహించనున్నారు. మహానాడులో ప్రవేశపెట్టబోయే తీర్మానాలకు.. పొలిట్‌బ్యూరో తుదిరూపునివ్వనుంది.
మహానాడు కోసం ఒంగోలు సమీపంలోని మండవవారిపాలెం వద్ద సభావేదిక ముస్తాబవుతోంది.
దారి పొడువునా పసుపు తోరణాలు, స్వాగత ద్వారాలు, ఫ్లెక్సీలు, బెలూన్లతో ఒంగోలు నగరాన్ని అలంకరిస్తున్నారు. డిజిటల్ తెరలు, భారీగా కార్యకర్తలు, అభిమానులు.. ఆశీనులయ్యేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మహానాడును.. ఆనందోత్సాహాల మధ్య నిర్వహించుకునేందుకు..పార్టీ అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు .