అన్నంలా ఇసుకనూ భోంచేస్తున్నాడు.. 40 ఏళ్లుగా అదేపని!
-ఒడిశాలో వలస కూలీగా పనిచేస్తున్న హరిలాల్
-చిన్నప్పటి నుంచే అలవాటుందని వెల్లడి
-నది వద్దకు వెళ్లి తినేవాడినని చెప్పిన వైనం
-ఎలాంటి ఆరోగ్య సమస్యా రాలేదని వ్యాఖ్య
ఒక్క ముద్దలో చిన్న రాయి వస్తేనే తుప్పున బయటకు ఉమ్మేస్తాం.. అలాంటిది ఇసుకను భోజనంలా లాగించేయడం సాధ్యమేనా? అంటే, సాధ్యమే అంటూ ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి.. ఇసుకను అన్నంలా నోట్లో వేసుకుని కరకరలాడించేస్తున్నాడు!
అవును, అతడి పేరు హరిలాల్ సక్సేనా. సొంతూరు ఉత్తరప్రదేశ్ లోని అరంగాపూర్ అయినా.. పదేళ్ల క్రితమే ఒడిశాకు వలస వచ్చాడు. గంజాం జిల్లా కీర్తిపూర్ లో భవన నిర్మాణ కూలీగా పనిచేస్తున్నాడు. అతడికి 40 ఏళ్లుగా ఇసుక తినే అలవాటుంది. భోజనానికి ముందో లేదంటే భోజనం తరువాతో ఇసుకను శ్నాక్స్ లాగా ఆరగించేస్తున్నాడు. అయితే, ఒకప్పుడు చాలా ఎక్కువగా తినేవాడినని, ఇప్పుడు తగ్గించేశానని హరిలాల్ చెబుతున్నాడు.
తన చిన్నప్పుడు తాముండే గ్రామానికి దగ్గర్లోనే ఓ నది ఉండేదని, రోజూ అక్కడకు వెళ్లి ఇసుకను తినేవాడినని అన్నాడు. వర్షాకాలం వస్తే ముందుగానే ఇసుకను ఇంట్లో భారీగా నిల్వ పెట్టుకునే వాడినని చెప్పాడు. ఇసుక తిన్న తర్వాత కాస్తంత అసౌకర్యంగా అనిపించినా.. ఆ తర్వాత అంతా మామూలుగా అవుతుందని వివరించాడు. ఇప్పటిదాకా తనకు ఎలాంటి అనారోగ్య సమస్య రాలేదని చెప్పుకొచ్చాడు.