నకిలీ వార్తల వ్యాప్తిపై కేంద్రం కొరడా.. 94 యూట్యూబ్ చానళ్లపై నిషేధం!
- రాజ్యసభలో అయోధ్య రామిరెడ్డి ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం
- 2021-22 మధ్య యూట్యూబ్ చానళ్లతోపాటు సోషల్ మీడియా ఖాతాలు, యూఆర్ఎల్స్‌పై చర్యలు
- సోషల్ మీడియాలో నకిలీ కంటెంట్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు కొత్త ఐటీ నిబంధనల యోచనలో కేంద్రం
నకిలీ వార్తలు ప్రసారం చేసే సామాజిక మాధ్యమాలపై కేంద్ర ప్రభుత్వం గత కొంతకాలంగా కఠినంగా వ్యవహరిస్తోంది. 2021-22 మధ్య కాలంలో అసత్య వార్తలను ప్రసారం చేస్తున్న 94 యూట్యూబ్ చానళ్లు, 19 సోషల్ మీడియా ఖాతాలు, 747 యూఆర్ఎల్ (URL)లపై నిషేధం విధించింది. రాజ్యసభలో వైసీపీ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ లిఖిత పూర్వకంగా సమాధానం ఇస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు.
డిజిటల్ మాధ్యమాల ద్వారా ప్రసారమవుతున్న అసత్య వార్తల వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ యాక్ట్ -2020 కింద గతేడాది ఫిబ్రవరి 25న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021ను రూపొందించినట్టు మంత్రి తెలిపారు. దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వ నిబంధనలు, కోడ్‌లు ఉల్లంఘించే యూట్యూబ్ చానళ్లు, సోషల్ మీడియా ఖాతాలపై చర్యలు తీసుకునే అధికారం కేంద్రానికి ఉందని మంత్రి పేర్కొన్నారు. కాగా, సోషల్ మీడియాలో ఇబ్బడిముబ్బడిగా వచ్చి పడుతున్న నకిలీ వార్తల వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్రం కొత్త ఐటీ నిబంధనలు రూపొందించాలని యోచిస్తోంది.