పరిహారం ఇచ్చాకే పోలవరంలో నీళ్లు నింపుతాం.. ఆ నిధుల కోసమే కేంద్రంతో కుస్తీ: సీఎం జగన్
- తరచూ కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తూనే ఉన్నట్టు వెల్లడి
- నిర్వాసితుల్లో ఏ ఒక్కరికీ అన్యాయం జరగనీయబోమని ప్రకటన
- ఈ సెప్టెంబర్ నాటికి పరిహారం అందజేస్తామన్న జగన్
- దశల వారీగా డ్యామ్ ను నింపుతామని వివరణ
పోలవరానికి సంబంధించిన నిధుల కోసం కేంద్ర ప్రభుత్వానికి తరచూ లేఖలు రాస్తూనే ఉన్నామని.. ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కోసం కేంద్ర ప్రభుత్వంతో కుస్తీ పడుతున్నామని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ తెలిపారు. సెప్టెంబర్ లోపు పోలవరం నిర్వాసితులకు పరిహారం అందజేస్తామని ప్రకటించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్న సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి పోలవరం నిర్వాసితులకు పరిహారం అందజేస్తామని ప్రకటించారు. ముంపు బాధితుల్లో ఏ ఒక్కరికీ అన్యాయం జరగనీయబోమని.. పరిహారం అందజేశాకే ప్రాజెక్టులో నీళ్లు నింపుతామని తెలిపారు. ముంపునకు గురవుతున్న నాలుగు మండలాలను ప్రత్యేక డివిజన్ గా ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.
దశల వారీగా మూడేళ్లలో పోలవరం నింపుతాం
పోలవరం ప్రాజెక్టులో ఒకేసారి నీళ్లు నింపడం కుదరదని, దానితో డ్యామ్ భద్రతకు ప్రమాదకరమని సీఎం జగన్ తెలిపారు. దీనికి కేంద్ర జల సంఘం నిబంధనలు కూడా అంగీకరించవన్నారు. తొలుత సగం వరకు డ్యామ్ ను నింపుతామని.. తర్వాత దశల వారీగా మూడేళ్లలో మొత్తం నీళ్లు నింపుతామని ప్రకటించారు. తొలుత మొదట 41.15 మీటర్ల మేరకు నింపుతామన్నారు. పోలవరం ఆర్‌అండ్‌ఆర్ నిధుల కోసం కేంద్ర ప్రభుత్వంతో యుద్ధాలు చేస్తూనే ఉన్నామని.. మరోవైపు బతిమిలాడుతూనే ఉన్నామని వివరించారు.