ఇతర రాజకీయ పార్టీలను బలహీన పరిచి తాము బలోపేతం కావడమే బీజేపీ లక్ష్యమన్న ఎంపీ
పవన్‌తో బీజేపీ స్నేహం కొనసాగుతుంది.. అమిత్ షా-ఎన్టీఆర్ భేటీపై ఆసక్తిని కొనసాగిద్దాం: ధర్మపురి అర్వింద్
జన్మదినం సందర్భంగా బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న అర్వింద్
పోలవరంపై ఎవరి ప్రయోజనాలు వారివన్న అర్వింద్
ఇతర రాజకీయ పార్టీలను బలహీనపరిచి తాము బలోపేతం కావడం బీజేపీ లక్ష్యమన్నారు ఎంపీ ధర్మపురి అర్వింద్ . ఇదో నిరంతర ప్రక్రియ అని, ప్రజాస్వామ్య బద్ధంగా అది కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. అలాగే సీబీఐ, ఈడీ వంటివి బీజేపీ గూటి పక్షులుగా మారాయన్న విమర్శలపై స్పందిస్తూ.. అవి గతంలో మోదీని ప్రశ్నించాయని, అమిత్ షాను కూడా జైలుకు పంపాయని గుర్తు చేశారు. సీబీఐ ఎక్కడికి వెళ్లినా బీజేపీ పంపినట్టు ఎలా అవుతుందని అర్వింద్ ప్రశ్నించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో బీజేపీ స్నేహం కొనసాగుతుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. నిన్న ఆయన తన జన్మదినం సందర్భంగా విజయవాడలోని కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా-జూనియర్ ఎన్టీఆర్ భేటీపై కొనసాగుతున్న ఆసక్తిని అలాగే కొనసాగిద్దామని అన్నారు.
ఏపీలోనూ బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కనకదుర్గమ్మ ఆశీస్సులు ఉన్న వంగవీటి గడ్డపైకి రావడం ఆనందంగా ఉందన్న ఆయన.. పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలపై ఏ రాష్ట్ర ప్రయోజనాలు ఆ రాష్ట్రానికి ముఖ్యమన్నారు.