జాతీయరాజకీయాల్లోకి రావాలని పెరుగుతున్న వత్తిడి …కేసీఆర్
-తెలంగాణను నడిపించినట్లే దేశాన్ని నడిపించాలని కోరుతున్న రైతు సంఘాలు
-కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి తో కేసీఆర్ సుదీర్ఘభేటీ
-ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో సమావేశం
-జాతీయ పార్టీ ఏర్పాటుపై వివరించిన కేసీఆర్
-ముందుండి నడిపిస్తే పూర్తి మద్దతు ఇస్తామన్న కుమారస్వామి
హైదరాబాదులోని ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి మధ్య సమావేశం ముగిసింది. ముఖ్యంగా, జాతీయ రాజకీయాలే ప్రధాన అజెండగా ఈ సమావేశం సాగింది. జాతీయస్థాయిలో పార్టీ స్థాపించాలని భావిస్తున్న కేసీఆర్ తన ఆలోచనలను కుమారస్వామితో పంచుకున్నారు. పార్టీ రూపురేఖలను, సిద్ధాంతాలను, విధివిధానాలను జేడీ(ఎస్) అగ్రనేతకు వివరించారు. పలు రాష్ట్రాల్లో తను సాగించిన పర్యటనల తాలూకు వివరాలను తెలిపారు.
సమావేశం సందర్భంగా కేసీఆర్ ఏమన్నారంటే…
జాతీయ రాజకీయాల్లోకి రావాలని నాపై నానాటికీ ఒత్తిడి పెరుగుతోంది. తెలంగాణను నడిపిస్తున్నట్టే దేశాన్ని కూడా నడిపించాలని కోరుకుంటున్నారు.
ఏ పర్యటనకు వెళ్లినా మోదీ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలంటూ ప్రజలు నినాదాలతో సూచిస్తున్నారు.
తెలంగాణ పట్ల వ్యతిరేక వైఖరితో ఉన్న బీజేపీ పట్ల ప్రజల్లో పూర్తిస్థాయిలో విముఖత కనిపిస్తోంది.
ఇటీవల హైదరాబాద్ వచ్చి మమ్మల్ని కలిసిన రైతు నేతలు కూడా తెలంగాణలో అమలు చేస్తున్న రైతు అనుకూల పథకాలు తమకు కూడా కావాలన్నారు. నేను జాతీయ రాజకీయాల్లోకి రావాలని రైతు సంఘాల నేతలు కూడా కోరారు.
జాతీయ అజెండాపై ఏకాభిప్రాయం సాధించాం. త్వరలోనే జాతీయ పార్టీ రూపకల్పన చేస్తాం.
దేశంలో విచ్ఛిన్నకర ధోరణులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ప్రజలను చీల్చే కుట్రలను కలిసికట్టుగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది.
కుమారస్వామి ఏమన్నారంటే…
అన్ని వర్గాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ సాధించిన కేసీఆర్ అనుభవం దేశానికి ఎంతో అవసరం.
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, ఇక్కడ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై దేశం మొత్తం మాట్లాడుకుంటున్నారు.
దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటుకు కేసీఆర్ ముందుండి నడిపిస్తే, అందుకు మేం సంపూర్ణ మద్దతు ఇస్తాం.
బీజేపీ విచ్ఛిన్నకర రాజకీయ పన్నాగాలను అడ్డుకోకపోతే దేశంలో రాజకీయ, పాలనాపరమైన సంక్షోభం తలెత్తుతుంది.
భావోద్వేగాలతో పబ్బం గడుపుకునే బీజేపీ పాలనకు ముగింపు పలకాల్సిన సమయం వచ్చింది.
బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనే అనే భావన బలహీనపడుతోంది.
కుల, మత, ప్రాంతాలకు అతీతంగా రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించే ఫ్రంట్ కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.
అయితే ప్రాంతీయ పార్టీల మధ్య ఐక్యత ఎంతో అవసరం.