అధికారిక నివాసాన్ని ఖాళీ చేయండి… మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామికి ఢిల్లీ హైకోర్టు ఆదేశం
- 6 వారాల్లో అధికారిక బంగ్లా ఖాళీ చేయాలన్న హైకోర్టు
- సుదీర్ఘ కాలం పాటు జనతా పార్టీలో కొనసాగిన సుబ్రహ్మణ్య స్వామి
- ఇటీవలే ముగిసిన స్వామి రాజ్యసభ సభ్యత్వం
బీజేపీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామికి బుధవారం ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. ఢిల్లీలో కేటాయించిన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలని హైకోర్టు ఆయనకు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం ఆయనకు 6 వారాల గడువు ఇచ్చింది. బీజేపీ ఎంపీగా పదవీ కాలం ముగిసిన నెలల వ్యవధిలోనే ఆయనకు ఈ తరహా ఆదేశాలు జారీ కావడం గమనార్హం.
సుదీర్ఘ కాలం పాటు జనతా పార్టీలో కొనసాగిన సుబ్రహ్మణ్య స్వామి… ఆ పార్టీకి అధ్యక్షుడిగానూ వ్యవహరించారు. 2013లో జనతా పార్టీని వీడిన ఆయన బీజేపీలో చేరారు. అంతకుముందు మాజీ ప్రధాని చంద్రశేఖర్ కేబినెట్‌లో మంత్రిగానూ పదవి చేపట్టారు. బీజేపీలో చేరాక 2016లో రాజ్యసభ సభ్యుడిగా పదవి చేపట్టిన ఆయన ఈ ఏడాది ఏప్రిల్ 24న తన పదవీ కాలాన్ని ముగించారు. బీజేపీలో ఉంటూనే ప్రధాని నరేంద్ర మోదీ సర్కారుపై విమర్శలు గుప్పిస్తూ సాగిన సుబ్రహ్మణ్యస్వామి నిత్యం వార్తల్లోనే ఉండేవారు.