నవంబర్‌లో మునుగోడు ఉప ఎన్నిక: బీజేపీ నేత సునీల్ బన్సల్!
- చౌటుప్పల్‌లో బీజేపీ నేతలతో సునీల్ బన్సల్ భేటీ
- మునుగోడు ఉప ఎన్నికలపై కీలక చర్చ
- ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందన్న బన్సల్
- ఇంచార్జీలంతా నియోజకవర్గంలోనే ఉండాలని ఆదేశం
తెలంగాణలో ఆసక్తి రేకెత్తిస్తున్న మునుగోడు ఉప ఎన్నిక నవంబర్ నెలలో జరిగే అవకాశం ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ తెలంగాణ ఇంచార్జీ సునీల్ బన్సల్ అన్నారు. మునుగోడు ఉప ఎన్నికపై పార్టీకి చెందిన కీలక నేతలతో సమీక్ష కోసం శనివారం తెలంగాణ వచ్చిన ఆయన మునుగోడు పరిధిలోని చౌటుప్పల్‌లో కీలక సమావేశాన్ని నిర్వహించారు. మునుగోడు ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు, ఉప ఎన్నిక కోసం ఇప్పటికే నియమించిన స్టీరింగ్ కమిటీ సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఈ సందర్బంగా మాట్లాడిన సునీల్ బన్సల్.. నవంబర్ మొదటి వారంలో లేదంటే రెండో వారంలో మునుగోడు ఉప ఎన్నిక జరగనుందని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి తీరుతుందని ఆయన అన్నారు. ఆయా మండలాల ఇంచార్జీలుగా నియమితులైన నేతలంతా నియోజకవర్గంలోనే ఉండాలని ఆయన సూచించారు. ఉప ఎన్నికను సీరియస్‌గా పరిగణించాలని ఆయన సూచించారు.