తమిళనాడు జాలర్ల వలకు చిక్కిన రూ.50 కోట్ల విలువైన అంబర్‌గ్రిస్!
- సముద్రంలో వేటకు వెళ్లిన కడప్కాకం జాలర్లు
- 38.6 కిలోల అంబర్ గ్రిస్ లభ్యం
- స్వాధీనం చేసుకున్న అటవీశాఖ అధికారులు
చేపల వేటకు సముద్రంలోకి వెళ్లిన తమిళనాడు జాలర్లకు రూ. 50 కోట్ల విలువైన అంబర్‌గ్రిస్ దొరికింది. అంబర్‌గ్రిస్ అనేది తిమింగలం వాంతి. దీనిని సుగంధ ద్రవ్యాల తయారీలో వాడతారు. మార్కెట్లో దీనికి విపరీతమైన డిమాండ్ ఉంది. తిమింగలాల కడుపులో తయారయ్యే దీనిని అవి వాంతి రూపంలో బయటకు పంపుతాయి. దీనిని ‘ఫ్లోటింగ్ గోల్డ్’గానూ వ్యవహరిస్తారు.
తాజాగా ఇది కల్పాక్కం సమీపంలోని జాలర్ల వలకు చిక్కింది. దీని విలువ రూ. 50 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. చెంగల్పట్టు జిల్లా కల్పాక్కం సమీపంలోని కడప్కాకం గ్రామానికి చెందిన ఇంద్రకుమార్, మాయకృష్ణన్, కర్ణన్, శేఖర్ కలిసి శనివారం చేపల వేటకు సముద్రంలోకి వెళ్లారు. వారి వలకు 38.6 కిలోల అంబర్‌గ్రిస్ పడింది. దీంతో వారు ఈ విషయాన్ని అచ్చిరుపాక్కం అటవీ అధికారులకు తెలియజేశారు. వారొచ్చి దీనిని స్వాధీనం చేసుకున్నారు.