కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఒక్క సారిగా పరుగులు తీసారు. ఆయన మాత్రమే కాదు. టీపీసీసీ చీఫ్ రేవంత్ తో పాటుగా సెక్యూరిటీ సిబ్బందిని పరుగుల తీయించారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర 53వ రోజుకు చేరింది. అందులో భాగంగా జడ్చర్ల మండలం గొల్లపల్లి నుంచి యాత్ర ఆదివారం ఉదయం ప్రారభమైంది. రాహుల్ తో పాటుగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీనియర్ నేత జానా రెడ్డి యాత్రలో పాల్గొన్నారు. రాహుల్ తో కలిసి అడుగులు వేసేందుకు పలు రంగాలకు చెందిన వారు సంఘీభావం ప్రకటిస్తున్నారు.
అదే సమయంలో అన్ని వయసుల వారూ రాహుల్ కు తమ మద్దతు ప్రకటిస్తున్నారు. అందులో భాగంగా, తాజాగా గిరిజనులతో కలిసి వేసిన డ్యాన్సులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. భద్రాచలం నుంచి వచ్చిన గిరిజనులతో రాహుల్ గిరిజన సంప్రదాయ నృత్యం చేసి ఆకట్టుకున్నారు. ఇక, ఈ ఉదయం కొందరు చిన్నారులు రాహుల్ తో కలిసి యాత్రలో పాల్గొన్నారు.
ఆ సమయంలో చిన్నారులతో ముచ్చటిస్తూనే రాహుల్ గాంధీ ఒక్క సారిగా పరుగులు తీసారు. దీంతో, రాహుల్ ను అనుసరిస్తున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ తో పాటుగా కార్యకర్తలు, అదే విధంగా భద్రతా సిబ్బంది ఆయన వెంట పరిగెత్తారు. కొద్ది దూరం పర్యటించిన తరువాత రాహుల్ ఆగిపోయారు. ఈ రోజు పాదయాత్రలో భాగంగా రాహుల్ యాత్ర రంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశిస్తోంది.
రేపు హైదరాబాద్ నగరంలోకి రాహుల్ యాత్ర ఎంటర్ కానుంది. మరో వైపు మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి పార్టీ నేతలు రాహుల్ గాంధీతో సమావేవమయ్యారు. నియోజకవర్గంలో ప్రచారం…ప్రత్యర్ది పార్టీల వ్యూహాల గురించి వివరించారు. కొందరు నియోజకవర్గంలోని ప్రముఖులు రాహుల్ తో సమావేశమయ్యారు. నవంబర్ 1న కాంగ్రెస్ అధ్యక్షుడుగా తాజాగా బాధ్యతలు చేపట్టిన మల్లిఖార్జున ఖర్గే హైదరాబాద్ లో రాహుల్ తో కలిసి భారత్ జోడో యాత్రలో పాల్గొనున్నారు. ఇక, ఇప్పుడు రాహుల్ గాంధీ పరుగులు తీయటం..ఆయన వెనుక రేవంత్ తో పాటుగా ఇతర నేతలు పరుగులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.