న్యాయం గెలిచింది… న్యాయమే గెలుస్తుంది: చంద్రబాబు
- అయ్యన్న రిమాండ్ కు తిరస్కరించిన విశాఖ కోర్టు
- అయ్యన్నతో పాటు రాజేశ్ కు బెయిల్ ఇచ్చిన వైనం
- ఈ విషయంపై హర్షం వ్యక్తం చేసిన చంద్రబాబు
- అయ్యన్నతోనే తామున్నామంటూ హ్యాష్ ట్యాగ్ పోస్ట్
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు రిమాండ్ కు విశాఖ మెట్రోపాలిటన్ కోర్టు తిరస్కరించిన ఘటనపై ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు హర్షం వ్యక్తం చేశారు. అయ్యన్న రిమాండ్ కు కోర్టు తిరస్కరించడంతో పాటు అక్కడికక్కడే అయ్యన్నతో పాటు ఆయన కుమారుడు రాజేశ్ కు బెయిల్ మంజూరు అయిన విషయంపై చంద్రబాబు సోషల్ మీడియాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. న్యాయం గెలిచింది.. న్యాయమే గెలుస్తుంది అంటూ చంద్రబాబు అన్నారు. ఈ మేరకు అయ్యన్నతోనే తాము ఉన్నామంటూ ఆయన ఓ హ్యాష్ ట్యాగ్ ను కూడా పెట్టారు.
2 సెంట్ల భూమి ఆక్రమణకు అయ్యన్న, ఆయన ఇద్దరు కుమారులు ఫోర్జరీ పత్రాలను సృష్టించారన్న ఆరోపణల కింద గురువారం తెల్లవారుజామున అయ్యన్నతో పాటు ఆయన కుమారుడు రాజేశ్ ను సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నిందితులిద్దరీ వైద్య పరీక్షలు నిర్వహించి సాయంత్రానికి విశాఖ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. సీఐడీ అధికారులు నమోదు చేసిన కేసును పరిశీలించిన న్యాయమూర్తి ఈ కేసులో నిందితులపై మోపిన ఐపీసీ 467 సెక్షన్ వర్తించదని తేల్చారు. దీంతో నిందితులకు అక్కడికక్కడే బెయిల్ మంజూరు చేశారు.