Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
సినిమా వార్తలు

కృష్ణ అంటే ఓ సాహసం .. ఓ ప్రయోగం!

కృష్ణ అంటే ఓ సాహసం .. ఓ ప్రయోగం!

  • ‘తేనె మనసులతో’ పరిచయమైన కృష్ణ 
  • ఒక ఏడాదిలో 19 సినిమాలు చేసిన రికార్డు 
  • దర్శక నిర్మాతగాను తనదైన ముద్ర 
  • టాలీవుడ్ కి ఆధునిక పోకడలను ఆహ్వానించిన రియల్ హీరో 
  • మల్టీ స్టారర్ల లోను ఆయనదే పై చేయి    
కృష్ణ అంటే రెండు అక్షరాలు కాదు .. దశాబ్దాల చరిత్ర..
సాహసాలకు … ప్రయోగాలకు ఆయన పేరు పుట్టినిల్లు..
పైకి సాదా సీదాగా.. సాఫ్టుగా కనిపించే కృష్ణ, కఠినమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో ఎంతమాత్రం వెనక్కి తగ్గని ధీశాలి. ఎవరైనా ఈ పని అసాధ్యం అంటే దానిని సాధ్యం చేసి చూపించేవరకూ నిద్రపోని ధీరోదాత్తుడు కృష్ణ. ఏం చేస్తే ఏం జరుగుతుందో .. పర్యవసానాలు ఎలా ఉంటాయో అనే భయం ఆయనలో మచ్చుకైనా కనిపించేవి కాదు. చేసేదేదైనా నమ్మకంతో చేయి .. ఫలితమేదైనా ధైర్యంగా స్వీకరించు అనే ఆలోచనా విధానం ఆయనలో కనిపిస్తుంది.’తేనె మనసులు’ సినిమాతో తెలుగు తెరకి హీరోగా కృష్ణ పరిచయమయ్యారు. ఆ సినిమా తీసిన ఆదుర్తి సుబ్బారావుని తన చివరి నిమిషం వరకూ కృష్ణ తలచుకుంటూనే వచ్చారు. తనకి లైఫ్ ఇచ్చినవారి పట్ల అది ఆయనకి గల విశ్వాసం. అలాగే తనతో వరుస సినిమాలు చేసిన కేఎస్ ఆర్ దాస్ .. డూండి వంటి వారిని గురించి కూడా ప్రతి వేదికపై చెబుతూనే వచ్చారు. తన సినీ ప్రయాణంలో తనకి సహకరించిన ప్రతి ఒక్కరినీ గుర్తుపెట్టుకుంటూ .. కృతజ్ఞతలు చెప్పుకుంటూ వచ్చినవారాయన. ఇక అప్పట్లో ఆయన సెట్లోనే నిద్రపోయేవారని చెబుతారు. ఎందుకంటే ఆయన మూడు షిఫ్టులు పనిచేసేవారు.

అందువల్లనే ఆయన 1970 నుంచి 74 వరకూ ఏడాదికి డజను సినిమాలకి పైగా చేస్తూ వచ్చారు. 1969లో ఆయన 19 సినిమాలను చేయడం ఒక రికార్డుగా ఇప్పటికీ ఆయన పేరుతోనే ఉండిపోయింది. ఒక వైపున పౌరాణికాలతో ఎన్టీఆర్ .. రొమాంటిక్ హీరోగా ఏఎన్నార్ .. జానపదాలతో కాంతారావు దూసుకుపోతున్న సమయంలో, బాలీవుడ్ – హాలీవుడ్ పోకడలను ఆయన తెలుగు తెరకి తీసుకుని వచ్చారు. తొలి తెలుగు జేమ్స్ బాండ్ చిత్రంగా ‘గూఢచారి 116’ .. తొలి తెలుగు కౌబోయ్ చిత్రంగా ‘మోసగాళ్లకు మోసగాడు’తో ఒక కొత్త ట్రెండ్ కి ఆయన స్వీకారం చుట్టారు. కథాకథనాల విషయంలో ఆధునిక పోకడలతో పాటు, సాంకేతిక పరిజ్ఞానం పరంగా కూడా ఫస్టు స్కోప్ సినిమాను .. 70 MM  సినిమాను తెలుగు తెరకి పరిచయం చేశారు.

ఇక సాహసాలు .. ప్రయోగాలు ఇతర నిర్మాతల డబ్బుతో చేయకూడదని భావించిన కృష్ణ, పద్మాలయ స్టూడియోస్ ను స్థాపించి వరుస సినిమాలు నిర్మించారు. ‘దేవుడు చేసిన మనుషులు’ ..  ‘అల్లూరి సీతారామరాజు’ .. ‘సింహాసనం’ వంటి సినిమాలు ఆ బ్యానర్ పైనా .. కృష్ణ కెరియర్ లోను చెప్పుకోదగిన సినిమాలుగా కనిపిస్తాయి. ఈ మూడు సినిమాల్లో ఏ సినిమా దెబ్బతిన్నా కృష్ణ కోలుకోవడం కష్టమయ్యేది. అయినా ఆయన వెనక్కి తగ్గకపోవడం వలన, అవి ఆయన కెరియర్లో మైలురాళ్లుగా మిగిలిపోయాయి.

కృష్ణ ఒక స్క్రిప్ట్ పట్టుకుని సెట్స్ పైకి వెళ్లినా .. ఒక రిలీజ్ డేట్ అనుకున్నా అది ఇక మారదనే విషయం అందరికీ తెలుసు. ఎన్టీఆర్ .. ఏఎన్నార్ .. శోభన్ బాబు .. కృష్ణంరాజు వంటి స్టార్ హీరోలతో మల్టీ స్టారర్ సినిమాలను నిర్మించిన ఘనత కృష్ణ సొంతం. ఆ సినిమాలన్నీ కూడా భారీ విజయాలను అందుకోవడం విశేషం. ఇక ఆయన సినిమాలకి పనిచేసిన ప్రతి ఒక్కరూ చివరి రూపాయిని అందుకోకుండా లేరు. ఇక కృష్ణకి డబ్బులు ఎగ్గొట్టిన నిర్మాతలు చాలామందే ఉన్నారు. అయినా ఆయన ఎవరినీ దూరం చేసుకునేవారు కాదు.

పేజీలకొద్దీ డైలాగులను కూడా ఒకసారి చదువుకుని చెప్పేయడం .. చాలా ఫాస్టుగా డబ్బింగ్ చెప్పేయడం కృష్ణ ప్రత్యేకత. హీరోగా ఏఎన్నార్ కి ఉన్న క్రేజ్ ను ప్రత్యక్షంగా చూసి .. ఆయన ప్రభావంతో సినిమాల్లోకి వచ్చిన కృష్ణ, చాలా వేగంగా ఆ తరువాత వరుసలో నిలవడం కృష్ణ పట్టుదలకు .. కృషికి నిలువెత్తు నిదర్శనమని చెప్పచ్చు.

తాను హీరోగా అడుగు పెట్టిన 9 ఏళ్లలోనే 100 సినిమాలను పూర్తి చేయడం ఆయన లక్ష్య సాధనకు కొలమానం. 300 సినిమాలకి గా నటించిన కృష్ణ ఆ తరువాత తరాల వారికి స్ఫూర్తిగా నిలిచారు. దశాబ్దాల ప్రయాణంలో మనసు మనసును గెలిచారు. సినీ రంగంలో తాను చేసిన కృషికి గాను ‘పద్మభూషణ్ ను అందుకున్న ఆయన, రాజకీయాలలోను అదే స్వచ్ఛతను కనబరిచారు.  ఇక సెలవు అంటూ ఈ లోకాన్ని విడిచినప్పటికీ, తెలుగు సినిమాను కొత్త దారుల్లో .. కొత్త తీరులో పరుగులు తీయించిన సాహసిగా .. ప్రయోగశీలిగా ఆయన పేరు చిరస్థాయిగా వెలుగొందుతూనే ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Related posts

ఆరు కోట్ల లగ్జరీ కారును లండన్ నుంచి కరాచీ ఎత్తుకెళ్లి.. చిన్న తప్పిదంతో దొరికిన దొంగలు!

Drukpadam

అడకత్తెరలో పోకచెక్కలాగా తెలుగు సినీ నిర్మాతల మండలి!

Drukpadam

పెళ్లి చేసుకుని నేనుపడిన తిప్పలు ఆ దేవుడికే తెలియాలి: సినీ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య!

Drukpadam

Leave a Comment