తాడికొండలో ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ!
- వైసీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు
- ఎమ్మెల్యే శ్రీదేవి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ మధ్య విభేదాలు
- చిచ్చుపెట్టిన పార్టీ సమన్వయకర్తగా డొక్కా నియామకం
ఆంధ్రప్రదేశ్ లోని తాడికొండలో అధికారపార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. వైసీపీ సమన్వయకర్తల నియామకంతో చిచ్చు రాజుకుంది. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ మధ్య కొనసాగుతోన్న ఆధిపత్య పోరు మరోసారి రచ్చకెక్కింది. ఫిరంగిపురం వేదికగా ఇరువురు లీడర్ల మధ్య కొత్త ఫైట్ మొదలైంది. గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్ష బాధ్యతలను డొక్కాకు అప్పగించడంతో శ్రీదేవి వర్గం రగిలిపోతోంది.
ఫిరంగిపురం మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో వైసీపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. సర్వసభ్య సమావేశం హైటెన్షన్ పుట్టించింది. దీంతో మండల పరిషత్ సమావేశంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఫిరంగిపురంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎమ్మెల్యే శ్రీదేవి, ఎమ్మెల్సీ డొక్కా మధ్య కొన్నాళ్లుగా యుద్ధం జరుగుతోంది. పార్టీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయి పోటాపోటీ ఆందోళనలు, ప్రెస్‌మీట్లు నిర్వహిస్తున్నారు.
తాడికొండ నియోజకవర్గమంతటా ఈ ఫైటింగ్ కొనసాగుతోంది. కొన్నిచోట్ల నేతల మధ్య మాటల యుద్ధం హద్దు దాటి కొట్టుకునేవరకూ వెళుతోంది. ప్రస్తుతం తాడికొండ వైసీపీలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.