గత ఇరవై ఏళ్లలో 5 భారీ భూకంపాల వివరాలు..
- టర్కీ, సిరియాల్లో పెరిగిన భూకంప మృతుల సంఖ్య
- ఇప్పటికే 4 వేలు దాటిన మరణాలు.. ఇంకా పెరగొచ్చని ఆందోళన
- సుమత్రా దీవుల్లో 2004 లో పెను విధ్వంసం
వరుస భూకంపాలతో టర్కీ (తుర్కియా) అతలాకుతలం అవుతోంది. వందలాది బిల్డింగ్ లు నేలమట్టమయ్యాయి. క్షణక్షణానికి మృతుల సంఖ్య పెరుగుతోంది. మంగళవారం ఉదయం మరోమారు టర్కీలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.6 పాయింట్ల తీవ్రతతో భూమి కంపించింది. టర్కీతో పాటు సిరియాలో భూకంపం వల్ల చనిపోయిన వారి సంఖ్య 4,300 లకు చేరింది.
భవనాల శిథిలాల కింద ఇప్పటికీ వేలాది మంది చిక్కుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. గడిచిన ఇరవై ఏళ్లలో అత్యంత వినాశనం సృష్టించిన భూకంపాలలో ఇదొకటని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గత ఇరవై ఏళ్లలో భారీ వినాశనానికి కారణమైన (టర్కీ, సిరియా సహా) ఐదు భూకంపాల వివరాలు..
2004లో సుమత్రా దీవులు..
ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో 2004 ఏడాది భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 9.2 తీవ్రతతో భూమి కంపించింది. దీంతో సుమత్రా దీవుల్లో కనీవినీ ఎరగని విధ్వంసం నెలకొంది. ఈ దుర్ఘటనలో 2,30,000 మంది ప్రాణాలు కోల్పోయారు.
2011లో జపాన్..
జపాన్ లోని తొహకు ఏరియా 2011లో వణికిపోయింది. భూకంపం ధాటికి భారీ నిర్మాణాలు నేలమట్టమయ్యాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 9.1 పాయింట్లుగా నమోదైంది. ఈ విధ్వంసంలో 15,899 మంది చనిపోయినట్లు జపాన్ ప్రభుత్వం తెలిపింది.
పాకిస్థాన్..
2013లో వెస్ట్రన్ పాకిస్థాన్ లో భారీ భూకంపం ఏర్పడింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.7 గా నమోదైంది. ఈ భూకంపం ధాటికి వేలాది ఇళ్లు నేలకూలాయి. పెద్ద సంఖ్యలో జనం నిరాశ్రయులయ్యారు. మొత్తంగా 350 మంది చనిపోయినట్లు అధికారులు అంచనా వేశారు.
నేపాల్..
2015 నేపాల్ లోని గోర్ఖా వాసులకు ఎంతో విషాదాన్ని మిగిల్చిన సంవత్సరంగా నిలిచింది. ఉన్నట్టుండి కాళ్లకింద భూమి కంపించడంతో ప్రజలు వణికిపోయారు. కళ్లముందే పెద్ద పెద్ద భవనాలు నేలకూలుతుంటే భయంతో ఆర్తనాదాలు చేశారు. ఈ దుర్ఘటనలో మొత్తం 8,964 మంది ప్రాణాలు కోల్పోగా 21,952 మంది గాయాలపాలయ్యారు. సుమారు 35 లక్షల మంది నిరాశ్రయులయ్యారని నేపాల్ ప్రభుత్వం వెల్లడించింది.