టర్కీ, సిరియాలలో 15 వేలు దాటిన మరణాలు!
- సహాయ చర్యలకు కీలకమైన 72 గంటల సమయం దాటిన వైనం
- శిథిలాల కింద చిక్కుకున్నవారు ఇక ప్రాణాలతో ఉండటం కష్టమే అంటున్న నిపుణులు
- ఇప్పటిదాకా 60 వేల మందిని రక్షించిన సహాయ బృందాలు
టర్కీ, సిరియాలో భూకంప మరణాల సంఖ్య గంట గంటకూ పెరుగుతూనే ఉంది. ఇరు దేశాల్లో సంభవించిన ఘోర భూకంపాల వల్ల ఇప్పటికే 15 వేల మృతి చెందారు. శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు గుట్టలుగా కనిపిస్తున్నాయి. సోమవారం సంభవించిన తీవ్ర భూకంపం కారణంగా టర్కీలో 12,391 మంది, సిరియాలో 2992 మంది మృతదేహాలను ఇప్పటిదాకా వెలికి తీశారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిలో దాదాపు 60 వేల పైచిలుకు మందిని సహాయ బృందాలు రక్షించాయి.
అయితే, సహాయ చర్యల్లో కీలకమైన 72 గంటల సమయం గడిచిపోయింది. దాంతో, ఇప్పటిదాకా శిథిలాల కింద చిక్కుకున్న వారు ఇక ప్రాణాలతో దక్కే అవకాశం లేదు. దాంతో, ఇకపై మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. శిథిలాలతో పాటు గడ్డకట్టిన మంచు కింద చిక్కుకొని ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.