ఈ రోజు తనను అరెస్టు చేస్తారు: ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా!
- కొన్ని నెలల పాటు జైలులోనే ఉంటానేమోనని కామెంట్
- తన భార్య అనారోగ్యంతో ఇంట్లో ఒక్కతే ఉందని వెల్లడి
- ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలంటూ కార్యకర్తలకు అప్పగింతలు
- సీబీఐ విచారణకు హాజరైన ఢిల్లీ డిప్యూటీ సీఎం
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు ఈ రోజు తనను అరెస్టు చేయబోతున్నారని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను చూసి భయపడుతోందని చెప్పారు. అందుకే తమపై తప్పుడు కేసులు పెట్టి మోదీ సర్కారు వేధిస్తోందని ఆరోపించారు. లిక్కర్ పాలసీ కేసులో తనను అరెస్టు చేసి, ఏడెనిమిది నెలలపాటు జైలులోనే ఉంచేస్తారని చెప్పారు.
ఇంటి దగ్గర తన భార్య అనారోగ్యంతో బాధపడుతూ ఒంటరిగా ఉందని, ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యకర్తలకు సూచించారు. ఢిల్లీ విద్యార్థులు బాగా చదువుకోవాలని, తల్లిదండ్రుల మాట ప్రకారం నడుచుకోవాలని సిసోడియా సూచించారు.
ఎందుకు విచారిస్తున్నారంటే..
ఢిల్లీ సర్కారు ఇటీవల తీసుకొచ్చిన లిక్కర్ పాలసీ వివాదాస్పదమైంది. అక్రమార్జన కోసం, డీలర్లకు లబ్ది చేకూర్చడం కోసమే ఈ పాలసీని ప్రభుత్వం రూపొందించిందని ఆరోపణలు వచ్చాయి. మద్యం వ్యాపారులకు లైసెన్సుల జారీలో కొంతమంది డీలర్లు లబ్ధి పొందారనేది ప్రధాన ఆరోపణ. ఢిల్లీ ఎక్సైజ్ శాఖ బాధ్యతలు చూస్తున్న మనీశ్ సిసోడియా ఈ కొత్త లిక్కర్ పాలసీ రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారు. దీంతో ఆయనపైనా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో సిసోడియాను ఇప్పటికే అధికారులు విచారించారు. అక్టోబర్ 17న సీబీఐ అధికారులు ఆయనను సుమారు 9 గంటల పాటు ప్రశ్నించారు. తాజాగా మరోమారు సిసోడియాను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. అయితే, సిసోడియాను ఈ రోజు అరెస్టు చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది.