ఈసారి తప్పకుండా రావాల్సిందే.. ఎంపీ అవినాష్‌రెడ్డికి సీబీఐ మరోమారు నోటీసులు..
- అవినాష్ తండ్రి భాస్కరరెడ్డికి కూడా నోటీసులిచ్చిన అధికారులు
- గత రాత్రి పులివెందులలోని ఇంటికి వెళ్లి మరీ నోటీసుల అందజేత
- గతంలోనూ ఇద్దరినీ విచారించిన సీబీఐ
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి మరోమారు నోటీసులు జారీ చేసింది. గత రాత్రి పులివెందులలోని ఆయన ఇంటికి వెళ్లిన అధికారులు నోటీసులు ఇచ్చారు. హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో ఈ నెల 10న జరిగే విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. అలాగే, 12న జరిగే విచారణకు హాజరు కావాలంటూ ఆయన తండ్రి భాస్కరరెడ్డికి కూడా నోటీసులు ఇచ్చారు.
నిజానికి అవినాష్ రెడ్డి నేడు విచారణకు హాజరు కావాల్సి ఉండగా వ్యక్తిగత కారణాలతో రాలేకపోతున్నట్టు సీబీఐకి తెలియజేశారు. ఈ నేపథ్యంలో అధికారులు తాజాగా మరోమారు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 10న తప్పకుండా హాజరు కావాల్సిందేనని అందులో పేర్కొన్నారు.
గూగుల్ టేకౌట్ సాయంతో..
వైఎస్ వివేకా హత్యకేసులో గతంలోనూ పలుమార్లు అవినాష్‌రెడ్డిని సీబీఐ విచారించింది. వివేకా హత్య జరిగిన రోజు అవినాష్ రెడ్డి ఫోన్ లొకేషన్ ఘటనా స్థలంలోనే ఉన్నట్టు గూగుల్ టేకౌట్ అప్లికేషన్ ద్వారా సీబీఐ గుర్తించింది. దీంతో ఆ సమయంలో అక్కడెందుకున్నారు? ఏం చేశారు? వివేకా హత్యలో ఆయన పాత్ర.. వంటి అంశాలపై సీబీఐ ఆరా తీసినట్టు తెలుస్తోంది. అలాగే, ఆయన తండ్రి భాస్కరరెడ్డిని కూడా పలుమార్లు ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో వీరిద్దరినీ మరోమారు ప్రశ్నించేందుకు పిలవడం చర్చనీయాంశమైంది.