మహారాష్ట్రలో ఒక్కరోజులోనే రెట్టింపు కరోనా కేసులు.. రెండు మరణాలు
- మంగళవారం 155 కేసులు నమోదు
- పుణె సర్కిల్ లో ఎక్కువ మంది బాధితులు
- దేశవ్యాప్తంగా 402 కొత్త కేసులు
కరోనా దాదాపు అంతరించే దశలో ఉందనుకుంటే.. ఒక్కసారిగా మహారాష్ట్రలో కేసులు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్రలో మంగళవారం 155 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రోజుతో పోలిస్తే రెట్టింపయ్యాయి. అంతేకాదు రెండు మరణాలు కూడా నమోదయ్యాయి. కరోనాతో ప్రాణాలు పోవడం చాలా కాలం తర్వాత నమోదైనట్టు చెప్పుకోవాలి.
అత్యధికంగా పుణె సర్కిల్ లో 75 కేసులు నమోదు కాగా, ముంబై సర్కిల్ లో 49 కేసులు వెలుగు చూశాయి. నాసిక్ లో 13 కేసులు వచ్చాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 81.38 లక్షలకు చేరుకోగా, మృతుల సంఖ్య 1,48,426కు పెరిగింది. సోమవారం మహారాష్ట్రలో 61 కేసులు నమోదు కావడం గమనించాలి. మొత్తం మీద ఇప్పటి వరకు మహారాష్ట్రలో కరోనా రికవరీ రేటు 98.17 శాతం ఉంటే, మరణాల రేటు 1.82 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా మంగళవారం 402 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. దేశంలో ఇప్పటి కరోనా బారిన పడిన వారి సంఖ్య 4.46 కోట్లకు చేరుకుంది.