చీమలపాడు లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని పర్యటన…!
ప్రభుత్వ ఉద్యోగం, రూ. 25 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్
బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా జరిగిన దురదృష్టకర ఘటనలో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, రూ. 25 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆ కుటుంబాలను ఆదుకోవాలని ఆయన కోరారు. శనివారం కారేపల్లి మండలం చీమలపాడు ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలను ఆయన పరామర్శించారు. ప్రతి కుటుంబానికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ అత్యంత దురదృష్టకరమైన సంఘటన అని నలుగురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమైన విషయమన్నారు. ప్రభుత్వం ఈ ఘటనకు సంబంధించి అలసత్వానికి తావులేకుండా వ్యవహరించాలన్నారు. కుటుంబాల స్థితిగతులను చూస్తుంటే అంతా పేద, గిరిజన కుటుంబాలకు చెందిన వారేనని సాంబశివరావు తెలిపారు. ఘటన తీరు హృదయవిదారకంగా ఉందన్నారు. మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి సిపిఐ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, కారేపల్లి మండల కార్యదర్శి బోళ్ల రామస్వామి, నాయకులు సుధాకర్ పాల్గొన్నారు.