దుబాయ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. నలుగురు భారతీయులు సహా 16 మంది సజీవ దహనం!
- అల్ రస్ ప్రాంతంలో ఘటన
- మరణించిన వారిలో కేరళ, తమిళనాడు, పాకిస్థాన్, నైజీరియా వాసులు
- భవన నిర్మాణంలో రక్షణ చర్యలు పాటించకపోవడమే ప్రమాదానికి కారణమన్న అధికారులు
దుబాయ్‌లోని ఓ నివాస భవనంలో సంభవించిన అగ్ని ప్రమాదంలో నలుగురు భారతీయులు సహా 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. దుబాయ్‌లోని అల్ రస్ ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం 12.35 గంటల సమయంలో ప్రమాదం సంభవించినట్టు ‘గల్ఫ్ న్యూస్’ తెలిపింది.
భవనంలోని నాలుగో అంతస్తులో సంభవించిన మంటలు క్రమంగా మిగతా అంతస్తులకు పాకాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న దుబాయ్ సివిల్ డిఫెన్స్ హెడ్‌క్వార్టర్స్ సిబ్బంది నివాసితులను అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనలో మరణించిన నలుగురు భారతీయుల్లో కేరళకు చెందిన దంపతులు, తమిళనాడుకు చెందిన ఇద్దరు ఉన్నట్టు అధికారులను ఉటంకిస్తూ స్థానిక మీడియా తెలిపింది. వీరందరూ అదే భవనంలో పనిచేస్తున్నట్టు తెలుస్తోంది.
అలాగే, ముగ్గురు పాకిస్థానీలు, ఓ నైజీరియా మహిళ ఉన్నట్టు పేర్కొంది. భవన నిర్మాణ సంస్థ సరైన రక్షణ చర్యలు పాటించకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలినట్టు దుబాయ్ సివిల్ డిఫెన్స్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.