పవన్ టీడీపీ వైపు రాకుండా బీజేపీ అడ్డుకుంటోంది: పితాని సంచలన వ్యాఖ్యలు…
- రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ టీడీపీతో కలవాలనుకుంటున్నారన్న పితాని
- వైసీపీకి బీజేపీ లోపాయికారీ మద్దతునిస్తోందని ఆరోపణ
- పితాని వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ
బీజేపీపై టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు పితాని సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీతో కలిసేందుకు సిద్ధమైతే బీజేపీ ఆయనను అడ్డుకుంటోందని ఆరోపించారు. ఈ రాష్ట్రానికి బీజేపీ అవసరమా? అని ప్రజలు ప్రశ్నించే రోజు అతి దగ్గర్లోనే ఉందన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నిన్న నిర్వహించిన సామాజిక చైతన్య పాదయాత్రలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తుందో, లేదంటే తెరవెనుక అధికార పార్టీకి కొమ్ము కాస్తుందో ఆ పార్టీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పులు చేసి ఢిల్లీకి వెళ్తున్న ముఖ్యమంత్రి జగన్‌కు మద్దతుగా నిలుస్తున్న కేంద్ర పెద్దలు.. రాష్ట్ర ప్రయోజనాల కోసం శ్రమిస్తున్న పవన్‌కు ఎందుకు అండగా నిలవలేకపోతున్నారో చెప్పాలన్నారు.
బీజేపీ క్రమశిక్షణ గల పార్టీ
రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్న పవన్‌ను అడ్డుకుంటూ, వైసీపీకి బీజేపీ లోపాయికారీ మద్దతు ఇస్తోందన్న పితాని వ్యాఖ్యలను బీజేపీ అధికార ప్రతినిధి చందూ సాంబశివరావు ఖండించారు. పనిలో పనిగా టీడీపీపై విరుచుకుపడ్డారు. టీడీపీ కుమ్మక్కు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందన్న ఆయన.. బీజేపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని అన్నారు.