Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పునఃనిర్మాణం అంటే ఇది … కొత్త సచివాలయ ప్రారంభ సందర్భంగా కేసీఆర్!

మొత్తం తెలంగాణనే కూలగొడతారా అంటూ కారుకూతలు కూశారు: సీఎం కేసీఆర్…

  • హైదరాబాదులో నూతన సచివాలయం ప్రారంభం
  • సచివాలయాన్ని ప్రారంభించడాన్ని అదృష్టంగా భావిస్తున్నానన్న కేసీఆర్
  • సచివాలయ నిర్మాణంలో అందరి కృషి ఉందని వెల్లడి
  • పునర్ నిర్మాణం అంటే ఏంటో చెప్పిన తెలంగాణ సీఎం

నూతన సచివాలయం ప్రారంభోత్సవం కార్యక్రమం సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రసంగించారు. కొత్త సచివాలయం ప్రారంభించిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు. సచివాలయం తన చేతుల మీదుగా ప్రారంభించడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. సచివాలయ నిర్మాణంలో అందరి కృషి ఉందని, చీఫ్ సెక్రటరీ నుంచి నాలుగో తరగతి ఉద్యోగుల వరకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని కేసీఆర్ పేర్కొన్నారు.

“సమాన హక్కుల కోసం పోరాడాలని, అందుకోసం బోధించు, సమీకరించు, పోరాడు అనే సందేశాన్ని ఇచ్చిన మహనీయుడు, విశ్వ మానవుడు, సమతా మూర్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్. ఆయన స్ఫూర్తితో, గాంధీజీ బాటలో పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆయన రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 వల్లే తెలంగాణ వచ్చింది. అంబేద్కర్ సూచించిన మార్గంలోనే ముందుకు వెళుతున్నాం.

తెలంగాణనే కాదు భారత జాతి కీర్తినే విశ్వవాప్తం చేసేలా ఇటీవల ఆకాశమంత ఎత్తు అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించుకున్నాం. ఆ క్రమంలోనే, సచివాలయానికి వచ్చే ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు కూడా ప్రతిక్షణం అంబేద్కర్ అడుగుజాడల్లోనే పనిచేసేలా, స్ఫూర్తి కోసం సచివాలయానికి కూడా ఆయన పేరు పెట్టుకోవడం జరిగింది.

తెలంగాణ కోసం పోరాటంలో వివిధ ఘట్టాల్లో అనేకమంది ప్రాణత్యాగాలు చేశారు… వారందరికీ జోహార్లు తెలుపుతున్నాను. తెలంగాణ సాకారం అయ్యాక పునర్ నిర్మాణం కోసం అనేక పనులు చేపడుతుంటే కొందరు కారుకూతలు కూశారు, పిచ్చి వాంతులు కూడా చేసుకున్నారు. పునర్ నిర్మాణం అంటే ఏంది? ఉన్నవి అన్నీ కూలగొడతారా? మొత్తం తెలంగాణనే కూలగొడతారా? అంటూ చిల్లర వ్యాఖ్యలు చేశారు.

కానీ నా తెలంగాణ ఈ రోజు ఆకాశమంత ఎత్తుకు ఎదిగిపోయిందని ఈ రోజు గర్వంగా చెబుతాను. తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని చోట్ల కూలగొట్టి నిర్మాణాలు చేపడుతున్నాం. పునర్ నిర్మాణం అంటే ఏంటో తెలియని మరుగుజ్జులకు నాలుగు విషయాలు చెబుతాను.

పునర్ నిర్మాణం అంటే… సమైక్య పాలనలో చిక్కి శల్యమైన కాకతీయుల నాటి నీటి పారుదలకు కొత్త రూపు తెచ్చుకున్నాం…. మిషన్ కాకతీయతో చెరువుల రూపురేఖలే మార్చుకున్నాం. మత్తడి దుముకుతున్న చెరువులే రాష్ట్ర పునర్ నిర్మాణానికి తార్కాణం. విద్యుత్ వెలుగు జిలుగులతో రాష్ట్రమంతా దేదీప్యమానంగా వెలిగిపోతుండడమే పునర్ నిర్మాణం.

33 జిల్లాలతో అలరారుతూ అద్భుతమైన పాలన అందిస్తున్న కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో నా సారథ్యంలో వెలుగుతున్న ప్రభలే తెలంగాణ పునర్ నిర్మాణం. కోల్పోయిన అడవులు తిరిగి తెచ్చుకోవడమే పునర్ నిర్మాణం. వలస పోయిన పాలమూరు బిడ్డలు తిరిగి రావడమే పునర్ నిర్మాణం. పారిశ్రామిక విధానంలోనూ, ఐటీ రంగంలోనూ బెంగళూరును కూడా దాటిపోతూ, తారాజువ్వలా దూసుకుపోతుండడమే పునర్ నిర్మాణం.

గత డీజీపీ మహేందర్ రెడ్డి, ఇప్పటి డీజీపీ అంజనీకుమార్ ఆధ్వర్యంలో గత పదేళ్లుగా ఒక్క మత కల్లోలం కూడా లేకుండా శాంతిభద్రతలు నెలకొల్పాం. స్వాతి లక్రా ఆధ్యర్యంలో షీ టీమ్ లతో మహిళలకు భరోసా ఇస్తున్నాం.

హైదరాబాద్ నే చూడండి… ఎన్నెన్ని ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు, ఎన్ని రకాల సౌకర్యాలతో ఏ విధంగా ముందుకుపోతోందో… అదీ పునర్ నిర్మాణం అంటే. రాష్ట్రంలో నలు దిశలా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఉన్నాయి. యాదాద్రి శిఖరం నుంచి రెండు చేతులతో దీవిస్తున్న యాదాద్రి ఆలయ పునర్ నిర్మాణం ప్రపంచానికి ఆదర్శం.

అష్టావక్రంగా, అడ్డదిడ్డంగా ఫైళ్లు పట్టుకుని పరిగెత్తాల్సిన పనిలేకుండా, హైదరాబాదులో శోభాయమానంగా రూపుదిద్దుకున్న పరిపాలన సౌధం నూతన సచివాలయమే పునర్ నిర్మాణానికి నిదర్శనం. రూ.3.17 లక్షల తలసరి ఆదాయంతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ గా ఉంది… ఇదీ పునర్ నిర్మాణం అంటే” అని వివరించారు.

Related posts

ఎంపీగా ప్రజ్ఞా ఠాకూర్‌ ఎలా కొనసాగుతున్నారు?: నటి స్వర భాస్కర్!

Drukpadam

ఉప ఎన్నిక‌ల్లో ప్రతిపక్షాల హవా.. బెంగాల్‌లో రెండు సీట్లూ టీఎంసీవే!

Drukpadam

అమెరికా నుంచి ఆఫ్ఘనిస్థాన్ కు ఆయుధాలు బంద్: బైడెన్ కీలక ఆదేశాలు!

Drukpadam

Leave a Comment