Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

సిద్ధరామయ్య నేపద్యం….

కర్ణాటకలో అఖండ విజయం సాధించిన కాంగ్రెస్‌ పార్టీ సీఎం అభ్యర్థిని ఖరారు చేసింది. రాష్ట్రంలో పాపులర్‌ నేతగా ఉన్న సిద్ధరామయ్య వైపే అధిష్టానం మొగ్గు చూపింది. దీంతో ఐదేళ్ల విరామం తర్వాత కన్నడ సీఎం పీఠంపై మరోసారి సిద్ధరామయ్య ఆశీనులు కానున్నారు. ఈ మేరకు సిద్ధూ తన కొత్త జట్టుతో కలిసి మే 20న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య ప్రస్థానాన్ని ఓసారి పరిశీలిస్తే..

రైతు కుటుంబంలో పుట్టి రాజకీయ కృషీవలుడిగా..

సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన సిద్ధరామయ్య స్వయంకృషితో ఎదిగారు. మైసూరు సమీపంలోని సిద్దరామనహుండిలో 1948 ఆగస్టు 12న జన్మించారు. తల్లిదండ్రులు నిరక్షరాస్యులు. రాష్ట్రంలో మూడో అతి పెద్ద సామాజిక వర్గమైన ‘కురుబ’ (ఓబీసీ)కు చెందిన నేత. ఉన్నత చదువులు అభ్యసించిన సిద్ధరామయ్య మైసూరులో న్యాయవాదిగా, న్యాయశాస్త్ర ఉపన్యాసకునిగా పని చేశారు. మరోవైపు, రైతు ఉద్యమాల్లో పాలుపంచుకుంటూ ప్రముఖ రైతు నాయకుడు నంజుండస్వామి ప్రియ శిష్యుడిగా పేరుగాంచారు. ఆయన స్ఫూర్తితోనే 1978లో తాలూకా బోర్డు సభ్యుడిగా ఎన్నికై తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి రాజకీయ కృషీవలుడిగా అంచెలంచెలుగా ఎదిగారు.

తొలి పోటీలోనే సంచలన విజయం

1963లో చాముండేశ్వరి అసెంబ్లీ స్థానం నుంచి భారతీయ లోక్‌దళ్‌ అభ్యర్థిగా పోటీ చేసి సంచలన విజయం సాధించిన సిద్ధూ.. ఆ తర్వాత జనతా పార్టీలో చేరారు. అప్పటి సీఎం రామకృష్ణ హెగ్డే మాతృభాష పరిరక్షణ కోసం స్థాపించిన ‘కన్నడ కావలు సమితి’ తొలి అధ్యక్షుడిగా సమర్థంగా పనిచేశారు. 1985 ఎన్నికల్లో గెలిచి హెగ్డే ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. 1989 ఎన్నికల్లో ఓడిపోయారు. 1992లో జనతాదళ్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1994 ఎన్నికల్లో గెలిచి దేవెగౌడ నాయకత్వంలోని జనతాదళ్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పని చేశారు. దేవేగౌడ ప్రధాని పదవిని చేపట్టడంతో 1996లో జేహెచ్‌.పటేల్ సీఎం అయ్యారు. అనంతరం సిద్ధరామయ్య ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. జనతాదళ్ జేడీఎస్‌, జేడీయూగా చీలిపోవటంతో సిద్ధరామయ్య.. దేవెగౌడ నాయకత్వంలోని జేడీఎస్‌లో చేరి రాష్ట్ర అధ్యక్షుడయ్యారు. 1999 విధాన సభ ఎన్నికల్లో ఓడిపోయారు. 2004లో ఏర్పడిన కాంగ్రెస్‌, జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా, ఆర్థిక మంత్రిగా సమర్థంగా పనిచేసే మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే, దేవెగౌడ తన తనయుడు కుమారస్వామిని ముందుకు తెచ్చేందుకు 2006లో పార్టీ నుంచి సిద్ధరామయ్యను సస్పెండ్‌ చేశారు. దీంతో ఆయన కాంగ్రెస్‌లో చేరారు. 2008 ఎన్నికల్లో గెలిచి సీఎల్పీ నేతగా ఎన్నికయ్యారు. 1983 నుంచి ఇప్పటివరకు సిద్ధు మొత్తం 9 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

మాట కఠినం.. 13సార్లు బడ్జెట్‌ ప్రవేశట్టిన అనుభవం..

సిద్ధరామయ్య రాష్ట్ర రాజకీయాల్లో అశేష అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. దేవరాజ్‌ అరసు తర్వాత ఐదేళ్ల పాటు సీఎంగా పనిచేసింది ఈయనే కావడం విశేషం. అహింద (బలహీనవర్గాల) సముదాయానికి ప్రతినిధిగా ఉండేందుకు ఇష్టపడే సిద్ధూ.. జనతా పరివార్‌ నుంచి 2006లో కాంగ్రెస్‌లోకి వచ్చినా పార్టీ భావజాలాన్ని సులువుగానే ఆకళింపు చేసుకున్నారు. జనతాదళ్‌లోనూ డిప్యూటీ సీఎంగా, ఆర్థికమంత్రిగా పనిచేసి ఇప్పటివరకూ 13సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఘనత కూడా ఆయనదే. మాట కఠినంగా ఉన్నా అభిమానుల మనసులు గెలిచిన సిద్ధూపై అవినీతి ఆరోపణలు కూడా పెద్దగా ఏమీ లేవు. 2013లో కాంగ్రెస్‌కు 122 సీట్లతో విజయాన్ని అందించడంలో ఆయన పాత్రను విస్మరించని అధిష్ఠానం సీఎంగా ఆయనకే అవకాశం ఇచ్చింది. అధిష్ఠానం విశ్వాసాన్ని వమ్ము చేయకుండా ఐదేళ్ల పాటు రాష్ట్రంలో ఏ పార్టీ అమలు చేయనన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందించారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలపైనా ఆయనకు పట్టు ఉంది. అపారమైన రాజకీయ అనుభవం.. పార్టీని, ప్రభుత్వాన్ని ఒంటిచేత్తో నడపగలిగే సత్తా ఆయన సొంతం. అధిష్ఠానం సైతం తన నిర్ణయాన్ని కాదనలేని వాతావరణాన్ని ఆయన సృష్టించుకున్నారు. ఈ ఎన్నికల్లోనూ డీకే శివకుమార్‌తో సీఎం విషయంలో పోటీ ఉన్నా, ఐక్యంగా పనిచేసి పార్టీని గెలిపించడంలో రికార్డు విజయాన్ని సాధించడంలోనూ సిద్ధూ కీలక పాత్ర పోషించారు. దీంతో ప్రజలతో పాటు పార్టీ అధిష్ఠానం మదిని గెలుచుకున్న సిద్ధూనే సీఎం పీఠం వరించింది.

Related posts

తొలిరోజు ముగిసిన చంద్రబాబు విచారణ.. 50 ప్రశ్నలు సంధించిన సీఐడీ!

Ram Narayana

ఎన్టీఆర్ ఘాట్ వద్ద తారక్‌ను ఇబ్బంది పెట్టిన ఫ్యాన్స్

Drukpadam

వికారాబాద్ జిల్లాలో పొలాల్లో కూలిపోయిన వింత వస్తువు… !

Drukpadam

Leave a Comment